కామారెడ్డిలో వరద బీభత్సం..ఆనవాళ్లు లేకుండా కొట్టుకుపోయిన కోళ్ల ఫారం

కామారెడ్డిలో వరద బీభత్సం..ఆనవాళ్లు లేకుండా కొట్టుకుపోయిన కోళ్ల ఫారం

కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టించాయి. గత 48 గంటలుగా ఎడతెరిపి లేకుండా జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు రికార్డు స్థాయిలో 65 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. గురువారం (ఆగస్టు 28)  ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు జిల్లావ్యాప్తంగా దాదాపు 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. దీంతో ఎన్నడూ లేనంతగా వరదలు సంభవించాయి.  

ఎల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డి గ్రామ శివారులో వరదలకు కోళ్ల ఫారం పూర్తిగా ఆనవాళ్లు లేకుండా కొట్టుకుపోయింది.  వరద ఉదృతికి కోళ్లా ఫారం షెడ్డూ వరదల్లో కనిపించికుండా పోయింది. దాదాపు 5వేల కోళ్లు ఒక్కటికూడా మిగలకుండా వరదల్లో కొట్టుకుపోయాయి. ఈ వరదల్లో దాదాపు 25 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు బోరున విలపించాడు. నష్టపోయిన బాధితుడికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.

కామారెడ్డి జిల్లాలో గడిచిన 48 గంటల్లో 65 సెంటీమీటర్ల ఆల్‎టైమ్ రికార్డ్ వర్షపాతం నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం (ఆగస్ట్ 28) ఉదయం నుంచి దాదాపు 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అవ్వగా.. ఓవరాల్‎గా దాదాపు 76 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయిందని పేర్కొంది. 

►ALSO READ | 48 గంటల్లో 65 సెంటీమీటర్ల వర్షపాతం: కామారెడ్డిలో ఆల్‎టైమ్ రికార్డ్ వర్షపాతం నమోదు

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురిసినట్లు తెలిపింది. అల్పపీడనం క్రమంగా బలహీనపడుతోందని.. దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ జారీ చేసింది వాతావరణ శాఖ. 

రెడ్ అలెర్ట్: నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి. ఈ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఆరెంజ్ అలర్ట్: ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.

ఎల్లో అలర్ట్: భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవచ్చని అంచనా వేసింది.