
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. చెరువు తెగి ఊరి మీద పడ్డట్టుగా వరదలు గ్రామాలను ముంచెత్తున్నాయి. రోడ్లు ఎక్కడికక్కడ కొట్టుకుపోయాయి. నదులు ప్రవహిస్తున్నట్లుగా పిల్ల కాలువలు సైతం భయంకరంగా ప్రవహిస్తుండటంతో జగిత్యాల జిల్లా జలదిగ్బంధంలో కూరుకుపోయింది. భారీ వరదలతో జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం స్థంభంపల్లి గ్రామంలోని పెద్ద చెరువుకు ప్రమాదం పొంచి ఉందనే భయంలో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.
బుధవారం (ఆగస్టు 27) రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి చెరువులోకి పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. త్వరలో వరద ఉదృతి పెరిగి మత్తడి దూకే స్థాయికి చేరింది. అయితే చెరువు తూము వద్ద కట్ట ఇప్పటికే బలహీనంగా ఉంది. దాని ముందు బండ రాళ్ళతో తెట్టె కట్టారు. మరో భారీ వర్షం పడితే నీటిమట్టం పెరిగి బండ రాళ్ళ తెట్టెను దాటుకుని దూకే అవకాశం ఉంది. తూము పక్కన బలహీనంగా ఉన్న కట్ట గుంతలోకి చేరనుంది. దీంతో నీటి మట్టం మరింత పెరిగి కట్టకు గండి పడే అవకాశం ఉంది.
►ALSO READ | భారీవర్షాలు, వరదలకు నిర్మల్ జిల్లా ఆగమాగం..జలదిగ్భంధంలో ముధోల్ గర్ల్స్ హాస్టల్
దీనిని ఇలాగే నిర్లక్ష్యం చేస్తే తప్పకుండా కట్టకు గండి పడుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ చెరువుకు గండి పడితే వెల్గటూర్, కోటిలింగాల, పాశీగాం గ్రామాల్లో భారీగా ప్రాణ, అస్థి నష్టాలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. తక్షణమే అధికారులు చెరువు వద్దకు వెళ్లి కట్టను పరిశీలించి వెంటనే మరమ్మత్తులు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. వాతావరణ శాఖ జిల్లాకు ఇప్పటికే రెడ్ అలెర్ట్ ప్రకటించిన క్రమంలో ఉన్నత స్థాయి అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.