కన్నయ్యకు వెన్న ఉండలు అటుకుల పొంగలి

కన్నయ్యకు వెన్న ఉండలు అటుకుల పొంగలి

చిన్ని కృష్ణుడు అనగానే గుర్తొచ్చేది ఆయన చేసిన వెన్న దొంగతనాలు, చిలిపి పనులు. వెన్న కోసం కన్నయ్య పోయిన గారాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.కుచేలుడు పెట్టిన గుప్పెడు అటుకులకు కరిగిపోయాడు. శ్రీకృష్ణుణ్ని కృష్ణాష్టమి రోజున బుడి బుడి అడుగులతో ఇంటికి ఆహ్వానించి.. కమ్మగా అటుకులతో, వెన్నతో ఈ వంటలు చేసి పెడితే సరి...         

అటుకులు కొబ్బరి పొంగలి
కావాల్సినవి
అటుకులు– రెండు కప్పులు, బెల్లం– ఒకటిన్నర కప్పు
నీళ్లు– తగినన్ని,  పచ్చికొబ్బరి తురుము– ముప్పావు కప్పు, నెయ్యి– కొద్దిగా, జీడిపప్పు– పావుకప్పు
ద్రాక్ష– రెండు టీ స్పూన్లు, యాలకులు– మూడు
పచ్చకర్పూరం– పావు చిటికెడు
తయారీ : 
అటుకులను జల్లెడలో వేసి నీళ్లుపోసి తడపాలి. తడిపిన అటుకులను అరగంటసేపు పక్కనబెట్టాలి.  కడాయిలో బెల్లం వేసి పావుకప్పు నీళ్లు పోసి కరిగించి తర్వాత వడకట్టాలి. వడకట్టిన పాకాన్ని మళ్లీ కడాయిలో పోసి కొబ్బరి తురుము వేయాలి. రెండు నిమిషాల తర్వాత తడిపిన అటుకులు వేసి  బాగా కలిపి స్టవ్‌‌ ఆపేయాలి. మరో కడాయిలో నెయ్యి వేడిచేసి జీడిపప్పు, ద్రాక్ష  వేగించాలి. వాటిని అటుకుల పొంగలిలో వేసి కలిపితే అటుకుల కొబ్బరి పొంగలి రెడీ.  
పల్లీ అటుకుల లడ్డు

కావాల్సినవి
అటుకులు – అరకప్పు, పల్లీలు– ఒక కప్పు
నువ్వులు – అరకప్పు, బెల్లం – ఒక కప్పు
యాలకుల పొడి– టీ స్పూన్‌‌
తయారీ : 
పాన్‌‌ వేడిచేసి పల్లీలు వేగించి పొట్టుతీయాలి. అదే కడాయిలో అటుకులు వేగించాలి. తర్వాత నువ్వులు వేసి కొన్ని నీళ్లు చిలకరించి ఎర్రగా వేగించాలి.  వేగించిన అటుకులను మెత్తటి పౌడర్‌‌గా‌‌ చేయాలి. పల్లీలు, నువ్వులు పొడిచేశాక దాంట్లో  బెల్లం వేసి మరోసారి మిక్సీపట్టాలి. ఆ మిశ్రమాన్ని గిన్నెలోకి తీసుకుని అటుకుల పొడి, యాలకుల పొడి వేసి గట్టిగా పిసుకుతూ కలపాలి. తర్వాత గట్టిగా లడ్డూలు చుట్టాలి. లడ్డూ చుట్టడం కష్టమైతే కొన్ని నీళ్లు లేదా నెయ్యి వేసి కలుపుతూ లడ్డూ చేయొచ్చు. 
అరటిపండు రవ్వ కేసరి
కావాల్సినవి: 
అరటిపండ్లు– రెండు, బొంబాయి రవ్వ– ఒక కప్పు 
నెయ్యి– కొద్దిగా, జీడిపప్పు– మూడు టేబుల్‌‌ స్పూన్లు, ద్రాక్ష– రెండు టేబుల్‌‌ స్పూన్లు
చక్కెర– అరకప్పు, పాలు– ఒకటిన్నర కప్పు
యాలకుల పొడి– అర టీ స్పూన్‌‌, బాదం – కొద్దిగా
తయారీ: 
బాండీలో నెయ్యి వేడిచేసి జీడిపప్పు, ద్రాక్ష వేగించాలి. అదే కడాయిలో ఇంకొంచెం నెయ్యి వేడిచేయాలి. సన్న మంటమీద బొంబాయి రవ్వను ఎర్రగా అయ్యేవరకు వేగించాలి. తర్వాత అరటిపండ్ల ముక్కలు వేసి గరిటెతో మ్యాష్‌‌ చేస్తూ వేగించాలి. అలా ఐదు నిమిషాలు వేగించాక  పంచదార వేసి కలపాలి. చక్కెర మొత్తం రవ్వలో కలిసిపోయాక పాలుపోసి ఉడికించాలి. చివర్లో జీడిపప్పు, ద్రాక్ష, నానబెట్టిన బాదంతో గార్నిష్‌‌ చేస్తే అరటిపండు రవ్వ కేసరి రెడీ. 
అటుకుల రవ్వకేసరి
కావాల్సినవి: 
అటుకులు – ఒక కప్పు
నెయ్యి – కొద్దిగా
జీడిపప్పు – మూడు టేబుల్‌‌ స్పూన్లు
కిస్​మిస్​– రెండు టేబుల్‌‌ స్పూన్లు
నీళ్లు – రెండు కప్పులు
చక్కెర – ఒక కప్పు
కేసరి‌‌ కలర్‌‌‌‌ – చిటికెడు
యాలకుల పొడి– అర టేబుల్‌‌ స్పూన్‌‌ 
తయారీ: కడాయిలో నెయ్యి వేడిచేసి జీడిపప్పు, కిస్​మిస్​వేగించాలి.ఇంకో కడాయిలో అటుకుల్ని క్రిస్పీగా 
వేగించాలి. అవి చల్లారాక మిక్సీజార్‌‌‌‌లో వేసి రవ్వలా చేయాలి. ఒక గిన్నెలో నీళ్లుపోసి బాగా కాగబెట్టాక అటుకులు వేసి మెత్తగా ఉడికించాలి. చక్కెర వేసి కరిగేవరకు కలుపుతూనే ఉండాలి. చక్కెర పూర్తిగా కరిగిన తర్వాత కొంచెం కేసరి‌‌ కలర్‌‌‌‌ వేసి మిశ్రమం దగ్గరపడే వరకు ఉడికించాలి. చివర్లో యాలకుల పొడి, జీడిపప్పు, ద్రాక్ష వేస్తే యమ్మీ స్వీట్‌‌ రెడీ‌‌. 
పోహా – పెసరపప్పు పాయసం
కావాల్సినవి 
అటుకులు –  అరకప్పు
పెసరపప్పు – అరకప్పు 
జీడిపప్పు – రెండు టేబుల్‌‌ స్పూన్లు
నెయ్యి – కొద్దిగా 
కిస్​మిస్​ – రెండు టీ స్పూన్లు
పాలు – అర లీటర్‌‌‌‌
బెల్లం తురుము – కప్పు
యాలకులు – నాలుగు 
జాజికాయ పొడి – కొద్దిగా
తయారీ: పెసరపప్పును బాగా కడిగి కుక్కర్‌‌‌‌లో రెండు విజిల్స్‌‌ వచ్చేవరకు ఉడికించాలి. కడాయిలో నెయ్యి వేడిచేసి జీడిపప్పు, కిస్​మిస్​ వేగించాలి. అదే నెయ్యిలో అటుకులు వేసి లేత బంగారు రంగులోకి వచ్చేవరకు వేగించాలి. తర్వాత ఉడికించిన పెసరపప్పు వేసి తక్కువ మంట మీద పెట్టి కలపాలి. తర్వాత పాలు పోసి పొంగు వచ్చేవరకు కాగబెట్టాలి. పాలు కాగాక బెల్లం వేసి కరిగించాలి. చివర్లో యాలకుల పొడి, జాజికాయపొడి, డ్రై ఫ్రూట్స్‌‌ వేసి కలిపి స్టవ్‌‌ ఆపేయాలి. తయారు చేసిన 20 నిమిషాల తర్వాత తింటే బాగుంటుంది. 

వెన్న ఉండలు 
కావాల్సినవి: 
వెన్న – ఒక కప్పు, బియ్యప్పిండి– ఒక కప్పు, నువ్వులు – కొద్దిగా
వాము – కొద్దిగా 
నూనె – వేగించేందుకు సరిపడా
ఇంగువ – చిటికెడు
ఉప్పు – రుచికి సరిపడా
తయారీ: ఒక గిన్నెలో బియ్యప్పిండి, వాము, ఉప్పు, నువ్వులు, ఇంగువ వేసి కలపాలి. దాంట్లో వెన్నవేసి మరికాసేపు చేత్తో కలపాలి. అవసరమైతే కొన్ని నీళ్లు చల్లి ముద్దగా చేయాలి. ఐదు నిమిషాలు పక్కన బెట్టాలి.  కడాయిలో నూనె వేడిచేయాలి. ముందుగా చేసిన ముద్దను చిన్న ఉండలు చేయాలి. ఆ ఉండల్ని నూనెలో వేసి ఎర్రగా వేగిస్తే కృష్ణయ్యకు ఇష్టమైన వెన్న ఉండలు రెడీ.