ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) బ్రాండ్ విలువ మరోసారి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. లీగ్‌లో మోస్ట్ పాపులర్ టీమ్, డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఈసారి తన రేటుతో దుమ్మురేపింది. ఆర్సీబీతో పాటు తొలి సీజన్ చాంపియన్ రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంచైజీలు రికార్డు ధరలకు అమ్ముడయ్యాయి. ఆర్సీబీ ఏకంగా1.78 బిలియన్ డాలర్లు (సుమారు రూ.16,706 కోట్లు) పలకగా.. రాయల్స్ 1.63 బిలియన్ డాలర్లకు (రూ. 15,290 కోట్లు) అమ్ముడైంది.
మంగళవారం ఖరారైన ఈ రెండు జట్ల విక్రయ విలువ ఏకంగా 32 వేల కోట్లు దాటడం క్రికెట్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. ఆర్సీబీని ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్, బోల్ట్ వెంచర్స్, బ్లాక్‌స్టోన్‌లతో కూడిన కన్సార్టియం సొంతం చేసుకుంది. తొలుత రాజస్తాన్ కోసం పోటీ పడ్డ ఈ గ్రూప్.. యూకేకు చెందిన డియాజియో గ్రూప్ నుంచి ఆర్సీబీ ఫ్రాంచైజీని 100 శాతం వాటాతో కొనుగోలు చేసింది.
ఈ డీల్‌లో మెన్స్ టీమ్‌తో పాటు విమెన్స్ డబ్ల్యూపీఎల్ టీమ్ కూడా భాగమే. 2008లో రూ. 485 కోట్లకు అమ్ముడైన ఈ జట్టు.. విరాట్ కోహ్లీ బ్రాండ్ ఇమేజ్, 2025 టైటిల్ విజయంతో ఇప్పుడు కళ్లు చెదిరే స్థాయికి చేరింది. ఆదిత్య బిర్లా గ్రూప్ డైరెక్టర్ ఆర్యమాన్ విక్రమ్ బిర్లా ఈ జట్టుకు చైర్మన్‌గా వ్యవహరించనున్నారు.
రాజస్తాన్ రాయల్ డీల్
బరిలోకి దిగిన తొలి ఏడాదే టైటిల్ నెగ్గిన రాజస్తాన్ ఫ్రాంచైజీని అమెరికా వ్యాపారవేత్త కల్ సోమాని నేతృత్వంలోని కన్సార్టియం కొనుగోలు చేసింది. 15 వేల కోట్ల పైచిలుకు మొత్తంతో ఈ గ్రూప్ సక్సెస్‌ఫుల్ బిడ్ వేసింది. ఈ కన్సార్టియంలో వాల్‌మార్ట్ వారసుడు రాబ్ వాల్టన్, ఫోర్డ్ మోటార్ కంపెనీకి చెందిన హాంప్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. 2021లోనే కల్ సోమాని రాయల్స్‌లో పెట్టుబడులు పెట్టాడు.
2008లో అత్యంత తక్కువ ధర రూ. 260 కోట్లు (67 మిలియన్ డాలర్లు) పలికిన రాజస్తాన్ వాల్యూ 19 ఏండ్లలో ఏకంగా 2300 శాతానికిపైగా జంప్ అయింది. 2021లో ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్ జెయింట్స్‌ను సంజీవ్ గోయెంకా నేతృత్వంలోని ఆర్పీఎస్జీ గ్రూప్ రూ. 7,090 కోట్లకు కొనుగోలు చేయడం అప్పట్లో రికార్డుగా నిలిచింది.
ఐదేండ్లు తిరిగే సరికి ఆర్సీబీ, రాజస్తాన్ రెండూ లక్నో ఫ్రాంచైజీ కంటే కంటే రెట్టింపు ధర పలకడం ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ ఏ రేంజ్‌లో ఉందో చెప్పేందుకు నిదర్శనం. కాగా, ఆర్సీబీ, రాజస్తాన్ రాయల్స్ జట్ల అమ్మకానికి బీసీసీఐ ఆమోదం తప్పనిసరి కావడంతో ప్రస్తుత ఐపీఎల్ సీజన్ ముగిసిన తర్వాత ఫ్రాంచైజీలను కొత్త ఓనర్లకు అప్పగించనున్నారు.
