జ్యుడీషియల్ కమిషన్ వేయండి ..గ్రూప్–1 ఎగ్జామ్స్పై కేటీఆర్ డిమాండ్

జ్యుడీషియల్ కమిషన్ వేయండి ..గ్రూప్–1 ఎగ్జామ్స్పై కేటీఆర్ డిమాండ్

 

  • గ్రూప్​–1 ఎగ్జామ్స్​పై  సుప్రీం లేదా హైకోర్టు సిట్టింగ్​ జడ్జితో విచారణ జరిపించాలి: కేటీఆర్​
  • ఫార్ములా ఈ రేస్​.. అదో లొట్టపీసు కేసని మరోసారి వ్యాఖ్య

హైదరాబాద్/మహబూబ్​నగర్, వెలుగు: గ్రూప్​ –1 పరీక్షల్లో కాంగ్రెస్​ ప్రభుత్వం అడ్డగోలుగా అవకతవకలకు పాల్పడిందని బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ ఆరోపించారు. టీజీపీఎస్సీ అవినీతి, పరీక్షలను అస్తవ్యస్తంగా నిర్వహించిన తీరుపై జ్యుడీషియల్​ కమిషన్​ ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని డిమాండ్​ చేశారు. గ్రూప్​– 1 పరీక్షల్లో అక్రమాలు జరిగినట్టు హైకోర్టు కూడా గుర్తించిందని, కాబట్టి హైకోర్టు లేదా సుప్రీంకోర్టు  సిట్టింగ్​ జడ్జి నేతృత్వంలో జ్యుడీషియల్​ఎంక్వైరీ చేయించాలని పేర్కొన్నారు. 

ఉద్యోగాలు అమ్ముకొని దందా చేసిన బ్రోకర్లు, తప్పులు చేసిన అధికారుల పేర్లు బయటకు రావాలన్నారు. మంగళవారం హైదరాబాద్​నందినగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని తన నివాసంలో కేటీఆర్​ గ్రూప్​– 1 అభ్యర్థులతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కేసీఆర్​ హయాంలో గ్రూప్​– 1 క్వశ్చన్​ పేపర్​ లీక్​ కావడంతో పరీక్షను రద్దు చేశారని గుర్తు చేశారు. కానీ, ఈ ప్రభుత్వం ఆ 500 పోస్టులకు మరో 63 పోస్టులనే కలిపి కొత్త నోటిఫికేషన్​ ఇచ్చి.. అడ్డగోలుగా పరీక్షలు నిర్వహించిందన్నారు. 

జీవో నంబర్ 29 ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పారు.  ఆ తర్వాత పరీక్ష నిర్వహిస్తే అందులో తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం జరిగిందని, కేవలం కొన్ని సెంటర్ల విద్యార్థులకే అధిక మార్కులు వచ్చాయని తెలిపారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏపీపీఎస్సీలో తెలంగాణ విద్యార్థులకు జరిగినట్లుగానే.. ఇప్పుడు కూడా అన్యాయం జరిగిందని ఆరోపించారు.  

కేసీఆర్​కు పేరు రావొద్దని..పాలమూరును పక్కన పెట్టిన్రు

'పాలమూరు' స్కీమును పూర్తి చేస్తే కేసీఆర్​కు పేరు వస్తుందన్న దురాలోచనతో సీఎం రేవంత్​ రెడ్డి ఈ ప్రాజెక్టుకు పక్కన పెట్టారని బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసి డెంట్ కేటీఆర్​ అన్నారు. మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్లలో మంగళవారం మధ్యాహ్నం ఓ ప్రైవేట్​ కార్యక్రమానికి కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్​ రావు హాజరయ్యారు. అనంతరం కేటీఆర్​మీడియాతో మాట్లాడారు. 

ఉమ్మడి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు కేసీఆర్​ పాలమూరు-రంగారెడ్డి స్కీమ్ ను డిజైన్​ చేశారన్నారు. తాము అధికారంలో ఉన్నంత వరకు 90 శాతం పనులు పూర్తి చేశామన్నారు. 2023 డిసెంబరులో  అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్..​ 21 నెలలు గడుస్తున్నా మిగిలిన పది శాతం పనులు  పూర్తి చేయడం లేదన్నారు. కేసీఆర్ మీద కోపంతో   ప్రాజెక్టును పూర్తి చేయడం ఇష్టం లేక రేవంత్​రెడ్డి సోర్సు మార్చారన్నారు.

లై డిటెక్టర్​ పరీక్షకు సిద్ధం 

ఫార్ములా ఈ రేస్ కేసు లొట్టపీసు కేసని కేటీఆర్​ మరోసారి వ్యాఖ్యానించారు. ఈ విషయంలో తాను ఇక్కడే ఉంటానని, ఎవరైనా వచ్చి లై డిటెక్టర్​ పరీక్ష చేసుకోవచ్చన్నారు. ఫార్ములా ఈ కేసుపై ప్రభుత్వానికి ఏసీబీ రిపోర్టు సమర్పించిన నేపథ్యంలో ఆయన స్పందించారు.