Operation Sindoor: 50 మిసైళ్లకే పాక్ తోక ముడిచింది ..ఎయిర్ మార్షల్ నర్మదేశ్వర్

Operation Sindoor: 50 మిసైళ్లకే పాక్ తోక ముడిచింది ..ఎయిర్ మార్షల్ నర్మదేశ్వర్

న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ మిషన్‌‌లో పాకిస్తాన్‌‌పై పూర్తి ఆధిపత్యం సాధించామని ఎయిర్‌‌‌‌ స్టాఫ్‌‌ వైస్ చీఫ్‌‌ ఎయిర్‌‌‌‌ మార్షల్ నర్మదేశ్వర్ తివారీ తెలిపారు. కేవలం 50 కంటే తక్కువ ఆయుధాలే (మిసైల్స్/డ్రోన్స్) ప్రయోగించామని, ఆ దెబ్బకే పాక్ విలవిల్లాడి కాల్పుల విరమణ కోసం కాళ్ల బేరానికి వచ్చిందని చెప్పారు. శనివారం ఢిల్లీలో ఎన్డీటీవీ డిఫెన్స్‌‌ సమిట్‌‌లో నర్మదేశ్వర్‌‌‌‌ తివారీ పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్ వివరాలను ఆయన వెల్లడించారు. ‘‘మే 7న తెల్లవారుజామున పాక్‌‌లోని ఉగ్ర స్థావరాలను నాశనం చేశాం. ఈ విషయాన్ని పాకిస్తాన్‌‌కు తెలియజేశాం. టెర్రరిస్టులే టార్గెట్‌‌గా దాడులు జరిపామని, ఈ సమస్యను పెద్దది చేయొద్దని చెప్పాం. కానీ పాక్ వినలేదు. మిలటరీ దాడులకు దిగింది.

 మే 9న రాత్రి అటాక్‌‌ చేసింది. దీంతో ఆ దేశానికి తగిన బుద్ధి చెప్పాలని నిర్ణయించాం. పాక్‌‌లోని మిలటరీ స్థావరాలే టార్గెట్‌‌గా అటాక్ చేశాం. లాంగ్ రేంజ్ వెపన్స్‌‌తో అక్కడి మిలటరీ బేస్‌‌లను నాశనం చేశాం. 1971 నాటి యుద్ధంలో నాశనం చేయలేని ప్రాంతాలను కూడా ఇప్పుడు ధ్వంసం చేయగలిగాం. దీంతో పాక్ విలవిల్లాడి పోయింది. కేవలం 50 కంటే తక్కువ ఆయుధాలకే దిగొచ్చింది. కాల్పుల విరమణ కోసం కాళ్ల బేరానికి వచ్చింది. దీంతో మే 10న మధ్యాహ్నం సీజ్‌‌ ఫైర్ కుదిరింది” అని వివరించారు.