లిక్కర్ రేట్లలో తెలంగాణ టాప్

లిక్కర్ రేట్లలో తెలంగాణ టాప్
  • లిక్కర్ రేట్లలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన దగ్గరే రేట్లు ఎక్కువ
  • ఒక్కో బాటిల్ పై రూ.20 నుంచి రూ.300 దాకా అదనం

హైదరాబాద్‌‌, వెలుగు: దేశంలో లిక్కర్‌‌ రేట్ల విషయంలో తెలంగాణ టాప్‌‌లో నిలిచింది. వివిధ రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో మద్యం ధరలు ఎక్కువగా ఉన్నాయి. బీరు, స్కార్చ్‌‌, విస్కీ ఏది తీసుకున్నా ఒకటి రెండు బ్రాండ్లు మినహా అన్నింటిలో ఒక్కో బాటిల్‌‌పై కనిష్టంగా రూ.20, గరిష్టంగా రూ.300 వరకు ఉన్నాయి. ఆదాయం పెంపు లక్ష్యంగా సర్కారు ధరలు పెంచుతోంది. రాష్ట్రంలో భారీ రేట్ల కారణంగా పక్క రాష్ట్రాల నుంచి లిక్కర్ అక్రమంగా తెలంగాణలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో అమ్మకాలు తగ్గే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు.

అన్ని బ్రాండ్ల ధరలూ ఎక్కువే

గుజరాత్‌‌, బీహార్‌‌, మిజోరం, నాగాలాండ్​లో లిక్కర్​పై బ్యాన్‌‌ ఉంది. మిగతా అన్ని రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలకు అనుమతి ఉంది. చాలా రాష్ట్రాలు ఆదాయం కోసం లిక్కర్‌‌పైనే ఆధారపడుతున్నాయి. ఇందులో తెలంగాణ కూడా ఉంది. ఈ ఏడేండ్లలో మన దగ్గర నాలుగు సార్లు మద్యం రేట్లను పెంచారు. దాదాపు 85% వరకు రేట్లుపెరిగాయి. దీంతో దేశంలో లిక్కర్‌‌ రేట్లు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ టాప్‌‌లో ఉంది. ఇంతకుముందు రేట్ల విషయంలో వెస్ట్‌‌ బెంగాల్‌‌, తమిళనాడు, ఏపీ రాష్ట్రాలు ముందుండేవి.  తెలంగాణలో ఓసీ ఫుల్‌‌ బాటిల్‌‌(750 ఎంఎల్‌‌) రూ.640 ఉండగా, వెస్ట్‌‌ బెంగాల్‌‌లో రూ.580 ఉంటే.. మిగతా అన్ని రాష్ట్రాల్లో రూ.500లోపే ఉంది. బీర్ల విషయానికొస్తే తెలంగాణలో కేఎఫ్‌‌ లైట్‌‌ రూ.150 ఉండగా, తమిళనాడులో రూ.140, బెంగాల్‌‌లో రూ.130, ఏపీలో రూ.135 ఉంది.

జోరుగా అక్రమ మద్యం రవాణా

రాష్ట్రంలో లిక్కర్‌‌ రేట్లు భారీగా పెంచడాన్ని మద్యం వినియోగదారులు వ్యతిరేకిస్తున్నారు. రేట్లు పెరగడంతో తక్కువ ధరలు ఉన్న పక్క రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి అక్రమ మద్యం వచ్చే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని ఎక్సైజ్‌‌ అధికారులూ చెబుతున్నరు. మద్యం రేట్లు పెరగడంతో సేల్స్‌‌ పడిపోయే అవకాశం లేకపోలేదు. గతంలో రూ.960కి రాయల్‌‌ ఛాలెంజ్‌‌ ఫుల్‌‌ బాటిల్‌‌ వచ్చేది. ఇప్పుడు రూ.1,200 అయ్యింది. గతంలో బీరు రేటు రూ.150కి పెంచగా, సేల్స్‌‌ పడిపోయాయి. మళ్లీ రూ.10 వరకు తగ్గించాక గానీ సేల్స్‌‌ పెరగలేదు.

ట్యాక్స్​ 85 శాతం ..

రాష్ట్ర ప్రభుత్వం మద్యం నుంచి రకరకాల పేర్లతో మస్తు పైసలు గుంజుతున్నది. వంద రూపాయల లిక్కర్‌‌ అమ్మితే అందులో రూ.85 దాకా సర్కారు ఖజానాలోకే వెళ్తున్నాయి. ఒక్కో బ్రాండ్‌‌, ఒక్కో బాటిల్‌‌పై వేర్వేరుగా ట్యాక్స్‌‌లు అమలు చేస్తున్నది. చీప్‌‌ లిక్కర్‌‌ బ్రాండ్లపై 85% దాకా ట్యాక్స్‌‌లు వేస్తుండగా, ప్రీమియం బాండ్లపై 70% దండుకుంటున్నది. ఇందులో వ్యాట్‌‌ 70 శాతం, ఎక్సైజ్‌‌ డ్యూటీ, స్పెషల్‌‌ ఎక్సైజ్‌‌ డ్యూటీ, అడిషనల్‌‌ ఎక్సైజ్‌‌ డ్యూటీ, స్పెషల్ సెస్‌‌, స్పెషల్‌‌ ప్రివిలేజ్‌‌ ఫీజు, పైసా అటు ఇటు ఉన్నా రౌండింగ్‌‌ అంటూ ట్యాక్స్‌‌లు, ఫీజులు వేసి లాగుతున్నది. ఈ భారాన్ని  వినియోగ దారుల నుంచే వసూలు చేస్తున్నది.