 
                                    దశాబ్దాల కల.. కోట్లాది అభిమానుల ఆశ.. సొంతగడ్డపై అద్భుతం చేయాలనే తపన నడుమ ఇండియా విమెన్స్ క్రికెట్ టీమ్ వన్డే వరల్డ్ కప్‌వేటకు సిద్ధమైంది. 47 ఏండ్లుగా అందని ద్రాక్షలా ఊరిస్తున్న వరల్డ్ కప్ టైటిల్‌కు ఒక్క అడుగు దూరంలో నిలిచింది. ఫైనల్ కు చేరుకున్న ఇండియా ఈ సారి ఎలాగైనా టైటిల్ ను ముద్దాడాలని హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని జట్టు పట్టుదలగా ఉంది. లీగ్ దశలో కొంచెం తడబడినా సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాపై విజయం టీమిండియా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఆదివారం (నవంబర్ 2) సౌతాఫ్రికాతో ఫైనల్లో గెలిచి సొంతగడ్డపై ట్రోఫీ కలను సాకారం చేసుకోవాలనే పట్టుదలతో కనిపిస్తుంది.
12 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఇండియాలో జరుగుతున్న ఈ వరల్డ్ కప్‌లో హోమ్ అడ్వాంటేజ్‌ను సద్వినియోగం చేసుకోని ప్రపంచ ఛాంపియన్ లుగా అవతరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 47 ఏళ్ళ మహిళల వన్డే చరిత్రలో భారత క్రికెట్ జట్టు ఒక్కసారి కూడా వరల్డ్ కప్ గెలవలేకపోయింది. 2005, 2017 వన్డే వరల్డ్ కప్ లో ఫైనల్ వచ్చినా తుది మెట్టుపై బోల్తా పడింది. 12 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఇండియాలో వరల్డ్ కప్ జరగనుండడంతో ఫ్యాన్స్ ఈ సారి మన మహిళల జట్టు ట్రోఫీ గెలుస్తుందని ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఉన్న జట్టుతో వరల్డ్ కప్ గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
2005 లో ఆస్ట్రేలియాపై ఓటమి:
ఇండియా 2005 లో తొలిసారి వన్డే వరల్డ్ కప్ ఫైనల్ కు చేరుకుంది. ఆస్ట్రేలియాతో జరిగిన ఈ సమరంలో ఘోరంగా ఓడిపోయింది. సౌతాఫ్రికా వేదికగా సెంచూరియన్ లో జరిగిన ఈ మెగా ఫైనల్లో ఇండియాపై ఆస్ట్రేలియా 98 పరుగుల భారీ తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఇండియా 117 పరుగులకు ఆలౌటైంది. తొలిసారి ఫైనల్ కు వచ్చి ఓడిపోవడంతో ఇండియా తీవ్ర భావోద్వేగానికి గురైంది.
2017లో మరోసారి హార్ట్ బ్రేక్:
12 సంవత్సరాల తర్వాత ఇండియా వన్డే వరల్డ్ కప్ లో మరోసారి ఫైనల్ కు చేరుకుంది. 2017 టోర్నీలో అద్భుతంగా ఆడి ఫైనల్ కు చేరుకుంది. సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించి రాయల్ గా ఫైనల్ కు చేరుకున్నారు. ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ఏ మెగా ఫైనల్లో తుది మెట్టుపై బోల్తా పడ్డారు. ఆతిధ్య జట్టు టీమిండియాను ఓడించి వరల్డ్ కప్ టైటిల్ ఎగరేసుకుపోయింది. లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ లో ఇంగ్లాండ్ పై జరిగిన ఈ థ్రిల్లింగ్ ఫైనల్లో ఇండియా కేవలం 9 పరుగుల తేడాతో ఓడిపోయి టైటిల్ చేజార్చుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఇండియా 48.4 ఓవర్లలో 219 పరుగులకు ఆలౌటైంది.

 
         
                     
                     
                    