కొలువుదీరిన కొత్త పాలకవర్గాలు.. పాలమూరు మేయర్ పీఠానికి ఒక్కరే నామినేషన్ వేయడంతో ఏకగ్రీవం

కొలువుదీరిన కొత్త పాలకవర్గాలు.. పాలమూరు మేయర్ పీఠానికి ఒక్కరే నామినేషన్ వేయడంతో ఏకగ్రీవం
  • పాలమూరు మేయర్​ పీఠానికి ఒక్కరే నామినేషన్​ వేయడంతో ఏకగ్రీవం
  • డిప్యూటీ మేయర్​గా మారేపల్లి సురేందర్​ రెడ్డి ఎన్నిక

మహబూబ్​నగర్/మహబూబ్​నగర్​ అర్బన్​/నారాయణపేట​, వెలుగు : మున్సిపాల్టీలు, కార్పొరేషన్​లో కొత్త పాలక వర్గాలు కొలువు దీరాయి. ఈ స్థానాలకు ఇటీవల ఎన్నికలు ముగిసి ఫలితాలు వెల్లడి కావడంతో, ఎన్నికల కమిషన్​ షెడ్యూల్​ ప్రకారం సోమవారం మహబూబ్​నగర్​ కార్పొరేషన్​తో పాటు ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలోని ఆయా మున్సిపాల్టీల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు మేయర్​, డిప్యూటీ మేయర్​, చైర్​ పర్సన్లు, వైస్​ చైర్​ పర్సన్లను ఎన్నుకున్నారు.

మేయర్​ ఎన్నిక యునానిమస్..

మహబూబ్​నగర్​ మేయర్​ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ కార్పొరేషన్​లో 60 ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డివిజన్లు ఉండగా, 58వ డివిజన్​ కార్పొరేటర్​  రమా దేవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో మిగతా స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా 29 స్థానాల్లో కాంగ్రెస్​, 15 స్థానాల్లో బీఆర్​ఎస్​, 8 స్థానాల్లో బీజేపీ, 3 స్థానాల్లో ఎంఐఎం, ఐదు స్థానాల్లో ఇండిపెండెంట్లు గెలుపొందారు. ఇందులో ఓ ఇండిపెండెంట్​ బీఆర్​ఎస్​కు మద్దతుగా ఆ పార్టీలో చేరడంతో వారి బలం 16 చేరింది. అయితే మిగతా నలుగురు ఇండిపెండెంట్లు, ముగ్గురు ఎంఐఎం  కార్పొరేటర్లు కాంగ్రెస్​కు మద్దతు తెలుపడంతో కాంగ్రెస్​ బలం 36కు చేరింది. 

సోమవారం ఉదయం కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారోత్సవం, అనంతరం మేయర్​, డిప్యూటీ మేయర్​ల ఎన్నిక నిర్వహించారు. సాధారణ ఎన్నికల పరిశీలకురాలు కాత్యాయని దేవి, కార్పొరేషన్​ స్పెషల్​ఆఫీసర్, మహబూబ్​నగర్​ స్థానిక సంస్థల అడిషనల్​ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, ఆర్డీవో నవీన్,  కార్పొరేషన్​ కమిషనర్ రామానుజులరెడ్డి, ఎక్స్ ఆఫీషియో సభ్యుడు, పాలమూరు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​ రెడ్డి హాజరయ్యారు. 

ముందుగా కోరం మొత్తం హాజరు కావడంతో ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్​ ఎన్నిక ప్రక్రియను ప్రారంభించారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​ రెడ్డి మేయర్​గా గుమాల​ మమత పేరును ప్రతిపాదించగా, ఎంఐఎం కార్పొరేటర్​ రషీద్​ ఆమె పేరును బలపర్చారు. సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయకపోవడంతో ఆమె ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. డిప్యూటీ మేయర్​గా మారేపల్లి సురేందర్​ రెడ్డి పేరును ఎమ్మెల్యే ప్రతిపాదించగా, ఎంఐఎం కార్పొరేటర్​ రషీద్​ బలపర్చాడు. సభ్యులు అభ్యంతరం చెప్పకపోవడంతో ఆయన కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్లుగా ఆర్డీవో ప్రమాణస్వీకారం చేయించారు. 

నారాయణపేటలో చైర్​ పర్సన్​ ఎన్నికకు బీఆర్​ఎస్​ గైర్హాజరు

నారాయణపేట మున్సిపాల్టీలో చైర్​ పర్సన్​ ఎన్నిక ఆసక్తికరంగా సాగింది. ఈ మున్సిపాల్టీలో 24 వార్డులుండగా, ఏ పార్టీకి మ్యాజిక్​ ఫిగర్​ రాలేదు. బీజేపీకి 11, కాంగ్రెస్​కు ఏడు, బీఆర్​ఎస్​కు రెండు, ఎంఐఎంకు రెండు, ఆల్​ ఇండియా ఫార్వర్డ్​ బ్లాక్​ ఒకటి, ఇండిపెండెంట్​ (బీజేపీ రెబల్​) ఒకరు గెలుపొందారు. ఇందులో బీజేబీ రెబల్​ మూడు రోజులు కిందట తిరిగి బీజేపీకి చేరగా వారి బలం 12కు చేరింది.

అయితే సోమవారం జరిగిన చైర్​ పర్సన్​ ఎన్నికల ప్రక్రియకు బీఆర్​ఎస్​కు చెందిన ఇద్దరు కౌన్సిలర్లు గైర్హాజర్​ అయ్యారు. మధ్యాహ్నం స్పెషల్​ ఆఫీసర్​ రాంచందర్ నాయక్ ఎన్నిక ప్రక్రియను ప్రారంభించగా, బీజేపీ చైర్​పర్సన్​ అభ్యర్థిగా కొండా శ్వేతా సత్యా యాదవ్​ పేరును 5వ వార్డు కౌన్సిలర్ రాఘవేంద్ర ప్రతిపాదించగా, ఒకటో వార్డు కౌన్సిలర్ సత్య రఘుపాల్ బలపరిచారు.

 కాంగ్రెస్​ నుంచి చైర్​ పర్సన్​గా శ్వేత పేరును 9వ వార్డు కౌన్సిలర్ మహేశ్ ప్రతిపాదించగా, 18వ వార్డు కౌన్సిలర్ గొల్ల రవితేజ్ బలపర్చారు. చేయి ఎత్తే విధానంలో ఓటింగ్ ప్రక్రియను ప్రారంభించగా బీజేపీ చైర్ పర్సన్ అభ్యర్థికి మహబూబ్​నగర్​ ఎంపీ డీకే అరుణ ఎక్స్ ఆఫీషియోతో పాటు 11 మంది బీజేపీ కౌన్సిలర్లు, 10వ వార్డు ఇండిపెండెంట్​ (బీజేపీ రెబల్​) కలిపి మొత్తం 13 మంది చేతులెత్తారు. కాంగ్రెస్ నుంచి ఎక్స్​ ఆఫీసీయోగా నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి, మిగతా కాంగ్రెస్ కౌన్సిలరు ఏడుగురు, ఇద్దరు ఎంఐఎం, ఒక ఏఐఎఫ్​బీ కౌన్సిలర్​ కలిపి మొత్తం 11 మంది చేతులెత్తి ఓటు వేశారు. అనంతరం ఎన్నికల ప్రత్యేక అధికారి రాంచందర్ నాయక్  13 మంది ఓట్లతో బీజేపీ అభ్యర్థి కొండా శ్వేతా సత్య యాదవ్ ను చైర్ పర్సన్ గా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించారు. 

మిగతా చోట్ల ఇలా..

మక్తల్​/మద్దూరు/కోస్తి/చిన్నచింతకుంట : దేవకరద్ర, భూత్పూర్​, మక్తల్​, కోస్గి, మద్దూరు మున్సిపాల్టీల్లో చైర్మన్​, వైస్​ చైర్మన్​ల ఎన్నిక ఏకగ్రీవంమైంది. దేవరకద్ర మున్సిపాల్టీలో మొత్తం 12 స్థానాలకు గాను కాంగ్రెస్​ ఆరు, బీఆర్​ఎస్​ నాలుగు, బీజేపీ ఒకటి, ఇండిపెండెంట్​ ఒకరు గెలుపొందారు. అయితే ఇండిపెండెంట్​ ఇటీవల కాంగ్రెస్​కు మద్దతు తెలుపగా, వారి బలం ఏడుకు చేరింది. తాజాగా చైర్ పర్సన్​ ఎన్నిక నిర్వహించగా చైర్​పర్సన్​గా కొండ దమయంతి, వైస్​ చైర్​పర్సన్​గా ఇండిపెండెంట్​గా గెలుపొందిన కౌన్సిలర్​ యుగంధర్​ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మక్తల్​ చైర్​ పర్సన్​గా వాకిటి మాసన, వైస్​ చైర్ పర్సన్​గా శైవి రెడ్డి, మద్దూరు మున్సిపల్​ చైర్​ పర్సన్​గా సర్వసతి జనార్దన్​, వైస్​ చైర్మన్​గా భాగ్యశ్రీ శంకర్​ రెడ్డి, కోస్గి చైర్మన్​గా నాగులపల్లి నరేందర్​, వైస్​ చైర్ పర్సన్​గా చింతాల సరిత, భూత్పూర్​ మున్సిపల్​ చైర్​పర్సన్​గా ముడావత్​ బాలకోటి, వైస్​ చైర్​ పర్సన్​గా లిక్కి సూర్యకళను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 

క్యాంపుల నుంచి నేరుగా ఆఫీసులకు..

శుక్రవారం అర్ధరాత్రి నుంచి క్యాంపుల్లోనే ఉన్న కార్పొరేటర్లు, కౌన్సిలర్లు సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో నేరుగా నగర పాలక సంస్థ, ఆయా మున్సిపల్​ ఆఫీసులకు చేరుకున్నారు. మహబూబ్​నగర్​ లో కాంగ్రెస్​ పార్టీ కార్పొరేటర్లు ఫలితాలు వెల్లడైన అర్ధరాత్రి ప్రత్యేక బస్సుల్లో ఏపీలోని చీరాలకు పయనం అయ్యారు. మరుసటి రోజు శంషాబాద్​లోని ఓ ప్రైవేట్​ రిసార్ట్​కు చేరుకున్నారు. 

రెండు రోజులు అనతరం సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో మహబూబ్​నగర్​ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​ రెడ్డి, మహబూబ్​నగర్​ డీసీసీ అధ్యక్షుడు సంజీవ్​ ముదిరాజ్​ ప్రత్యేక బస్సుల్లో వారిని కార్పొరేషన్​ ఆఫీసుకు తీసుకొచ్చారు. అలాగే క్యాంపులో ఉన్న నారాయణపేట కౌన్సిలర్లను మహబూబ్​నగర్​ ఎంపీ డీకే అరుణ సోమవారం మున్సిపల్​ ఆఫీసుకు తీసుకొచ్చారు.