హైదరాబాద్, వెలుగు: రోజూ ఉదయం 8 నుంచి 12 వరకు వనస్థలిపురంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో క్లినికల్ పోస్టింగ్ లు ఉంటాయని, అక్కడి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న మంగళపల్లిలోని మెడికల్ కాలేజీ క్యాంపస్ కు వెళ్లాల్సి వస్తోందని మహేశ్వరం గవర్నమెంట్ మెడికల్ కాలేజీ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కాలేజీకి బస్సు సదుపాయం లేకపోవడంతో ప్రైవేటు వాహనాలపై ఆధారపడాల్సి వస్తోందని, తక్షణమే రవాణా సౌకర్యం కల్పించాలని, క్యాంపస్ లోనే హాస్టల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
తమ సమస్యల పరిష్కారం కోసం సోమవారం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ముందు ఆ కాలేజీ విద్యార్థులు ఆందోళన చేశారు. ప్రస్తుతం అధికారికంగా ఎలాంటి హాస్టల్ లేకపోవడంతో మెడికోలంతా ప్రైవేటు హాస్టల్స్ లో ఉండాల్సి వస్తోందని తెలిపారు.
