
- దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
- ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్కు మాలల జేఏసీ వినతి
ముషీరాబాద్, వెలుగు: మార్వాడీలు తెలంగాణలో పెత్తనం చెలాయిస్తూ ఇక్కడి వారిపై దాడులకు దిగడం హేయమైన చర్య అని తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ డాక్టర్ మందాల భాస్కర్, గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ బేర బాలకిషన్ అన్నారు. గురువారం వారు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు వినతిపత్రం సమర్పించారు. ఇటీవల సికింద్రాబాద్ మోండా మార్కెట్ సమీపంలోని సాయి కుమార్ అనే వ్యక్తిపై దాడి చేసి కులం పేరుతో దూషించిన మార్వాడీలపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఓ పక్క ఎస్సీ వర్గీకరణ రోస్టర్ విధానంతో మాలలకు విద్యా ఉద్యోగాల్లో అన్యాయం చేస్తున్నారని, మరోపక్క తమను టార్గెట్ చేస్తూ కొందరు దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకుంటే హైదరాబాద్ బంద్ కు పిలుపునిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాల సంఘాల జేఏసీ నాయకులు డాక్టర్ వీరస్వామి, కొప్పుల అర్జున్, గోపి, సత్యనారాయణ, అరుణ్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.