మాలలు మరో పోరాటానికి సిద్ధం కావాలి : జి.చెన్నయ్య

మాలలు మరో పోరాటానికి  సిద్ధం కావాలి : జి.చెన్నయ్య
  • భవిష్యత్ కార్యాచరణ 
  • కోసం ఈ నెల 11న సమావేశం నిర్వహిస్తం

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఎస్సీ వర్గీకరణపై న్యాయపోరాటం చేస్తూనే ప్రజా పోరాటాలకు మాలలు సిద్ధం కావాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణ ద్వారా మాలలకు జరిగిన అన్యాయంపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణ కోసం ఈ నెల 11న హైదరాబాద్ లక్డీకపూల్‌‌‌‌లో మాల మహానాడు రాష్ట్రస్థాయి ముఖ్య నాయకుల సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌‌‌‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. సుప్రీంకోర్టు సూచనలు పాటించకుండా రాష్ట్ర ప్రభుత్వం చేసిన వర్గీకరణ వల్ల మాలలు విద్య, ఉద్యోగ రంగాల్లో తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. 

గ్రూప్- 3లో మాలలతో పాటు మరో 25 కులాలకు అన్యాయం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన రోస్టర్ విధానాన్ని సవరించాలని డిమాండ్ చేశారు. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. రాజ్యాంగం కల్పించిన 15 శాతం విద్య, ఉద్యోగ అవకాశాల్లో మాలలను 5 శాతానికి పరిమితం చేశారని మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగా మాలలను అణచివేసే కుట్ర చేశారని, మాలల హక్కుల కోసం, రాజ్యాంగ రక్షణ కోసం భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు బైండ్ల శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగి ఆనందరావు, నల్గొండ జిల్లా అధ్యక్షుడు లకుమాల మధుబాబు, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లలిత, మరిపల్లి శ్రీకాంత్, రాజేశ్, రాకేశ్, శివశంకర్, బాలకృష్ణ, శాలిం రాజు, వీరేంద్ర పాల్గొన్నారు.