
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్లో చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ చిచ్చు మొదలైంది. తన ఒంటెత్తు పోకడలతో మిగతా ఇద్దరు ఎమ్మెల్యేలను ఇబ్బంది పెడుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయంగా వాళ్లను అగణదొక్కడానికి తెరవెనుక కుట్రలు చేస్తున్నారని, బాల్క సుమన్‌తో మంచిర్యాల, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్యలకు మధ్య గ్యాప్ పెరిగింది అందుకేనని గులాబీ పార్టీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నాయి.
ప్రభుత్వ విప్, పార్టీ జిల్లా ప్రెసిడెంట్ హోదాలను అడ్డం పెట్టుకొని సుమన్ వన్‌మ్యాన్ షో చేయడాన్ని ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేకపోతున్నారనే టాక్ మొదలైంది. వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కించుకొని ఐదోసారి గెలవాలని దివాకర్‌రావు, హ్యాట్రిక్ కొట్టాలని చిన్నయ్య భావిస్తున్నారు. ఈసారి వారికి చెక్ పెట్టేందుకు సుమన్ పావులు కదుపుతున్నారంటూ వస్తున్న వార్తలు బీఆర్ఎస్ శ్రేణులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే చెన్నూర్ ఎమ్మెల్యే నల్లాల ఓదెలును, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్‌కుమార్‌లను రాజకీయంగా దెబ్బతీసిన సుమన్ ఇప్పుడు మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలను టార్గెట్ చేశారనే చర్చ జరుగుతోంది.
నాడు నల్లాలకు ద్రోహం..
ఇంతకుముందు పెద్దపల్లి ఎంపీగా ఉన్న బాల్క సుమన్ కిందటి ఎన్నికల్లో చెన్నూర్ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లాల ఓదెలును పక్కన పెట్టించి ఆయన సీటు దక్కించుకోవడం తెలిసిందే. ఓదెలు నామినేటెడ్ పోస్టును ఆశించగా ఆయన తిరిగి యాక్టివ్ అయితే తనకు కష్టమని ఓదెలు భార్య భాగ్యలక్ష్మిని జడ్పీ చైర్పర్సన్ కుర్చీలో కూర్చోబెట్టారు. తర్వాత వారిని అడుగడుగునా అవమానించడంతో తట్టుకోలేక కాంగ్రెస్‌లోకి వెళ్లారు. దీంతో జడ్పీలో భాగ్యలక్ష్మి ఒంటరి కాగా, హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్వార్టర్‌ను ఖాళీ చేయించారన్న ఆరోపణలున్నాయి.
ఓదెలు వచ్చే ఎన్నికల్లో తనకు ప్రత్యర్థిగా మారే అవకాశం ఉండడంతో కాంగ్రెస్‌లోని కోవర్టులను ఉసిగొల్పి ఆయన సొంతగూటికి తిరిగి వచ్చేలా చేశారని పార్టీ శ్రేణుల్లోనే చర్చ జరిగింది. మొత్తానికి ఓదెలును యాక్టివ్ పాలిటిక్స్‌లోనే లేకుండా చేసిన ఘనుడు బాల్క సుమన్ అన్నది అందరూ అనుకుంటున్న మాట! అంతేగాకుండా చెన్నూర్ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్‌ను అగణదొక్కేందుకు రెండోసారి ఎమ్మెల్సీ రాకుండా అడ్డుకున్నది ఆయనేనని సతీష్ అనుచరులు నేటికీ మండిపడుతున్నారు. నియోజకవర్గంలో మరో కీలకనేత జడ్పీ మాజీ వైస్ చైర్మన్మూల రాజిరెడ్డిని, భీమారం మండలానికి చెందిన చెరుకు సరోత్తంరెడ్డితో పాటు మరికొంతమంది లీడర్లను ప్లాన్ ప్రకారం అణిచివేశారని ఆగ్రహంతో ఉన్నారు. వాళ్లంతా బీఆర్ఎస్లో ఉండీ లేనట్టుగా ఉంటూ టైమ్ కోసం ఎదురుచూస్తున్నారు.
దివాకర్‌రావు, చిన్నయ్య టార్గెట్‌గా..
మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గాలపై ఆధిపత్యం కోసం సుమన్ అందివచ్చిన ఏ చాన్స్‌నూ వదులుకోవడం లేదు. గతంలో సుమన్ వ్యవహార శైలి వల్ల తాము ఇబ్బందులు పడుతున్నామని దివాకర్‌రావు, చిన్నయ్య సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులకు విన్నవించగా కాస్త కంట్రోల్లో పెట్టారనే ప్రచారం ఉంది. కానీ ఇటీవల సుమన్ వీరిద్దరిని టార్గెట్ చేశాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బెల్లంపల్లిలో దుర్గం చిన్నయ్యను తొక్కి తనకు సన్నిహితుడైన రేణికుంట్ల ప్రవీణ్‌కు టికెట్ ఇప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్టు బీఆర్ఎస్ వర్గాలే వెల్లడిస్తున్నాయి. అరిజిన్ డెయిరీ వివాదాన్ని చిన్నయ్య మెడకు చుట్టడంలో ఎవరి పాత్ర ఎంతన్న చర్చ నడుస్తోంది. ఇక సీనియర్ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావుకు, సుమన్మధ్య కూడా గ్యాప్ బాగా పెరిగినట్టు కనిపిస్తోంది. ఈ నెల 9న సీఎం కేసీఆర్పర్యటనతో ఇద్దరి విభేదాలు పీక్లెవల్కు చేరినట్టు తెలుస్తోంది.
సీఎం సభా ఏర్పాట్లు మొదలు జనసమీకరణ దాకా అంతా వన్‌మ్యాన్ షో చేయడంపై ఇద్దరు ఎమ్మెల్యేలు ఆగ్రహంతో ఉన్నట్టు చెప్తున్నారు. బహిరంగ సభలో ‘నన్నెందుకు మాట్లాడియ్యలే’దంటూ అందరిముందే సుమన్‌పై దివాకర్‌రావు ఫైర్అయ్యారు. ఇద్దరి మధ్య మాటామాట పెరగడంతో దివాకర్‌రావును ఆయన కొడుకు విజిత్‌రావు, ఎంపీ వెంకటేశ్ నేత వారించారు. సభ ముగిసిన తర్వాత వేదికపై కేసీఆర్‌ను శాలువాతో సత్కరించబోగా ఆయన అసహనంతో తిరస్కరిస్తూ దివాకర్‌రావును నెట్టివేశారు. తనకు జరిగిన అవమానాన్ని దివాకర్‌రావు జీర్ణించుకోలేకపోతున్నారని బీఆర్ఎస్ లీడర్లు చర్చించుకుంటున్నారు.