విశ్లేషణ: నేడు డా.మర్రి చెన్నారెడ్డి వర్ధంతి

V6 Velugu Posted on Dec 02, 2021

తెలంగాణ తొలి దశ ఉద్యమ సారథి.. రెండు సార్లు ముఖ్యమంత్రి పదవి.. సుదీర్ఘ కాలం పాటు గవర్నర్​గిరి.. అత్యంత చిన్న వయసులోనే మంత్రి హోదా.. ఇవన్నీ చెప్పగానే ఎవరికైనా గుర్తొచ్చే పేరు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి. ఆంధ్రప్రదేశ్​ రాజకీయాలపై చెన్నారెడ్డి వేసిన ముద్ర చెరగనిది. రాజకీయ దురంధరుడిగా.. పరిపాలనాదక్షుడుగా ఆయన నడిచిన బాట అనితర సాధ్యం. ప్రస్తుత వికారాబాద్​ జిల్లా మార్పల్లి మండలం సిరిపురం గ్రామంలో శంకరమ్మ, లక్ష్మారెడ్డి దంపతులకు 1919 జనవరి 13న చెన్నారెడ్డి జన్మించారు. చాలా చురుకైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్నారు. హైస్కూలు విద్యార్థిగా ఉన్న రోజుల్లోనే ఉపన్యాస పోటీలను ఏర్పాటు చేయడం, గ్రంథాలయాలను స్థాపించడం, సేవాకార్యక్రమాలను నిర్వహించడం ద్వారా తోటి విద్యార్థుల్లో ఉత్తేజం నింపేవారు. కాలేజీలో చదువుతున్న రోజుల్లో సాంఘిక సేవా దళాలను ఏర్పాటు చేసి.. వాటికి నాయకత్వం వహించడమో లేదా నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా జరిగే రాజకీయ మహాసభల్లో ప్రతినిధిగా పాల్గొనడమో చేస్తూ ఉండేవారు. చిన్ననాటి నుంచి డాక్టర్​ కావాలని కలగన్న చెన్నారెడ్డి తన 22వ ఏట ఎంబీబీఎస్​ పట్టా తీసుకోవడం ద్వారా ఆయన కల నెరవేర్చుకున్నారు. ఆ తర్వాత వరంగల్​ లోని గాంధీ ఆస్పత్రిలో ప్రభుత్వ డాక్టర్​గా నియమితులయ్యారు. ఉద్యోగంలో చేరిన రెండు నెలల్లోనే రాజీనామా చేసి హైదరాబాద్​లో సొంతంగా రెండు హాస్పిటళ్లు ఏర్పాటు చేసి వైద్యం చేయడం మొదలుపెట్టారు. రెండేండ్ల తర్వాత ఆ రెండు హాస్పిటళ్లను మూసివేసి, తన జీవితాన్ని దేశ రాజకీయాలకు అంకితం చేశారు. 

గాంధీజీ పిలుపుతో..
గాంధీజీ పిలుపు మేరకు 1935లో ఆంధ్రమహాసభలో చెన్నారెడ్డి పాల్గొన్నారు. అది ఆయన రాజకీయ అరంగేట్రంగా చెప్పవచ్చు. కార్యకర్తగా, సమావేశకర్తగా, ఖాదీ ప్రచారకునిగా, విద్యార్థి నాయకునిగా, ఆంధ్ర విద్యార్థి కాంగ్రెస్ వ్యవస్థాపకునిగా అనేక స్థాయిల్లో పనిచేసి అనుభవాన్ని సంపాదించారు. 1938లో జైలు శిక్షను కూడా అనుభవించారు. తర్వాత రోజుల్లో ఆంధ్ర యువజన సమితి, విద్యార్థి కాంగ్రెస్​ను స్థాపించారు. అనేక విద్యార్థి, యువత, విద్యా, అక్షరాస్యత, సాంస్కృతిక సంస్థల్లో చురుకుగా పాల్గొనే వారు. ఒక వారపత్రికకు రెండేండ్ల పాటు సంపాదకత్వం వహించారు. అనేక పత్రికలకు వ్యాసాలు కూడా రాశారు. అప్పటి హైదరాబాద్​ రాష్ట్రంలో సాగిన స్వాతంత్ర్యోద్యమంలో చెన్నారెడ్డి పాల్గొన్నారు. 1942లో ఆంధ్ర మహాసభ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1946లో జరిగిన రాష్ట్ర స్టేట్ కాంగ్రెస్ మహాసభకు చెన్నారెడ్డి ఆహ్వాన సంఘ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. చివరికి  స్టేట్ కాంగ్రెస్ ఆధ్వర్యంలోనే హైదరాబాద్ ప్రజలు నిజాం నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడారు. నిజాం మీద సాగించిన ఈ పోరాటాన్ని అహింసాయుత పద్ధతిలో నడిపించాలన్నది చెన్నారెడ్డి అభిమతం. ఆ సందర్భంలో ఆయన ఢిల్లీ వెళ్లి జవహర్​ లాల్​ నెహ్రూ, సర్దార్ వల్లభ్​ భాయ్ పటేల్, డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ తదితరులను కలుసుకుని వచ్చారు. మహాత్మాగాంధీ ఆశీస్సులను కూడా పొందారు.

హైదరాబాద్​ పేరుతో వారపత్రిక
చెన్నారెడ్డి అనేక సంవత్సరాలు ఆంధ్రా ప్రావిన్స్ కాంగ్రెస్ కమిటీకి ప్రధాన కార్యదర్శిగా, 30 సంవత్సరాలు పీసీసీ వర్కింగ్ కమిటీ సభ్యునిగా ఉన్నారు. హైదరాబాద్​ స్వాతంత్ర్య పోరాటం ఉధృత రూపం దాల్చడంతో, నిజాం ప్రభుత్వం నాయకులందరినీ అరెస్టు చేసింది. ఇలా అరెస్టు అయిన నాయకుల్లో చెన్నారెడ్డి చాలా చిన్నవారు. చర్చల ఫలితంగా జైలు నుంచి విడుదలై, స్టేట్ కాంగ్రెస్ నాయకులందరూ హైదరాబాద్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలకు వలస వెళ్లి అక్కడి నుంచి ఉద్యమం సాగించారు. ఆ సమయంలో చెన్నారెడ్డి విజయవాడ వెళ్లి.. “హైదరాబాద్” అనే వారపత్రికను నిర్వహిస్తూ హైదరాబాద్ ప్రజలు సాగిస్తున్న స్వాతంత్ర్య పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లారు. ఆ సమయంలో భారత ప్రభుత్వం కలుగజేసుకుని నిజాంపై పోలీసు చర్యలకు దిగి, హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియాలో విలీనం చేసింది. దాంతో పార్లమెంటుకు హైదరాబాద్ రాష్ట్రంలోని కొందరిని ప్రజాప్రతినిధులుగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ఆనాటి పార్లమెంటు సభ్యుల్లో చెన్నారెడ్డి కూడా ఒకరు. పార్లమెంటులో హైదరాబాద్​లోని విషమ పరిస్థితులను గురించి చెన్నారెడ్డి చేసిన ప్రసంగాలు నెహ్రూ, రాజాజీ వంటి వారిని ఆకర్షించాయి. దీంతో చెన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీ విప్ గా ఎన్నికయ్యారు. 

సీఎంగా, గవర్నర్​గా సేవలు
ఉత్తర ప్రదేశ్(1970ల మధ్యలో రాష్ట్రపతి పాలన సమయంలో), రాజస్థాన్, పంజాబ్, తమిళనాడు, పాండిచ్చేరి గవర్నర్‌‌గా పని చేశారు. 1971లో సిక్స్ పాయింట్ ఫార్ములా రూపొందించిన ఘనత ఆయనదే. 1972లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టోలో న్యూ డీల్ ఫర్ తెలంగాణగా చేర్చారు. చెన్నారెడ్డి శక్తిసామర్థ్యాలను గుర్తించిన ఇందిర ఆయనను ఉత్తరప్రదేశ్ గవర్నర్​గా నియమించారు. 1974 అక్టోబర్ లో పదవి చేపట్టిన ఆయన.. 1977 అక్టోబర్​లో గవర్నర్ పదవికి రాజీనామా చేసి హైదరాబాద్ తిరిగివచ్చారు. దేశ పరిస్థితులను, వివిధ పార్టీల తీరుతెన్నులను పరిశీలించిన ఆయన చివరకు కాంగ్రెస్(ఐ) పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. 1978 జనవరి 18న కాంగ్రెస్(ఐ) రాష్ట్ర అధ్యక్ష పదవిని చేపట్టారు. 1978 ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నారెడ్డి కృషితో కాంగ్రెస్(ఐ) 180 స్థానాలు గెలుచుకుంది. చెన్నారెడ్డి 1978 మార్చి 6న సీఎం పదవి చేపట్టారు. 1989 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా పార్టీని విజయ పథంలో నడిపించారు. 1989 డిసెంబర్‌‌లో రెండోసారి సీఎం పదవి చెపట్టారు. ఆ తర్వాత ఎన్నికల రాజకీయాలకు దూరమై మరణించే వరకూ ఇతర రాష్ట్రాల్లో గవర్నర్‌‌ గా కొనసాగారు. 1996 డిసెంబర్ 2న చెన్నారెడ్డి తుదిశ్వాస విడిచారు.

ఆంధ్రప్రదేశ్​లో విలీనాన్ని వ్యతిరేకించి..
1952లో దేశమంతటా ప్రప్రథమంగా వయోజన వోటింగు పద్ధతిలో జనరల్ ఎలక్షన్లు జరిగాయి. చెన్నారెడ్డి హైదరాబాద్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు. తర్వాత బూర్గుల మంత్రివర్గంలో ఆహార, వ్యవసాయ శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇండియన్ డెలిగేషన్​కు నాయకత్వం వహించి 1953, 1955 సంవత్సరాల్లో విదేశాల్లో పర్యటించారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత సంజీవరెడ్డి, బ్రహ్మానందరెడ్డి మంత్రి వర్గాల్లో కూడా చెన్నారెడ్డి మంత్రిగా పనిచేశారు. ఆంధ్ర రాష్ట్రంతో తెలంగాణ విలీనాన్ని చెన్నారెడ్డి వ్యతిరేకించారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత పెద్దమనుషుల ఒప్పందంపై సంతకం చేసిన తెలంగాణ నేతల్లో ఆయన ఒకరు. 1967లో చెన్నారెడ్డిని ఇందిర కేంద్ర కేబినెట్​లో ఉక్కు మంత్రిగా తీసుకున్నారు. ఆ సమయంలో తెలంగాణ ప్రజలు సాంఘిక, ఆర్థిక, విద్యా రంగాల్లో వెనుకబడి ఉండటాన్ని చెన్నారెడ్డి సహించలేకపోయారు. 1968 ఏప్రిల్ లో మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్​కు రాగానే "తెలంగాణ ప్రజాసమితి" పార్టీని నెలకొల్పి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం సాగించారు. ఉద్యమాన్ని రాజకీయం చేసేందుకు చెన్నారెడ్డి తెలంగాణ ప్రజాసమితి అధ్యక్షుడయ్యారు. విభజనకు మద్దతిచ్చే ఆ పార్టీ 11 లోక్​సభ స్థానాలను (14 స్థానాల్లో) గెలుచుకోవడం ద్వారా ప్రజా ఆదరణ పొందింది. 

- సంగనభట్ల రామకిష్టయ్య, ఎనలిస్ట్ 

Tagged marri chenna reddy, marri chenna reddy death anniversary, marri chenna reddy biography

Latest Videos

Subscribe Now

More News