
అమరవీరుల స్మారకం ప్రాజెక్టు విశేషాలు
- ప్రాజెక్టు వైశాల్యం: 3.29 ఎకరాలు(13,317చ.మీ.లు)
- నిర్మాణ వైశాల్యం(బిల్టప్ ఏరియా): 26,800చ.మీ.లు (2,88,461 చ.అ.లు)
- మొత్తం అంతస్థులు: 6 (రెండు సెల్లార్లు కలిపి)
- స్మారకం మొత్తం ఎత్తు: 54మీటర్లు
- దీపం ఎత్తు: 26 మీటర్లు
- స్టెయిన్‌లెస్ స్టీల్ క్లాడింగ్: 100 మెట్రిక్ టన్నులు
- నిర్మాణానికి ఉపయోగించిన స్టీల్: 1500 మెట్రిక్ టన్నులు
- ప్రాజెక్టు వ్యయం: రూ.177.50 కోట్లు
- పరిపాలనా అనుమతుల జారీ: జూన్ 17, 2017
- పనుల ఒప్పందం: సెప్టెంబర్ 14, 2018
- కాంట్రాక్టు సంస్థ: కేపీసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్
- కన్సల్టెంట్: ఎంవీ రమణారెడ్డి, తనికెళ్ల ఇంటిగ్రేటెడ్ కన్సల్టెంట్స్ ప్రై.లి.
- దుబాయి నుంచి తెచ్చి ఇక్కడ అమర్చి
అమరుల స్మారక భవనం వెలుపల నిర్మాణం కోసం 3000 స్టెయిన్‌లెస్ స్టీల్ ప్లేట్లను ఉపయోగించారు. ఈ మొత్తం ప్లేట్ల బరువు సుమారు 100 టన్నులు. వీటిని దుబాయ్‌లో ఫ్యాబ్రికేట్ చేయించి ఇక్కడికి తరలించగా, సైట్‌పై వీటిని అత్యాధునిక టెక్నాలజీతో అతుకులు లేనివిధంగా అసెంబుల్ చేశారు. లోపలి గోడలు, స్లాబులకు మాత్రమే కాంక్రీట్‌ను ఉపయోగించారు. దీనికోసం సుమారు 1200 టన్నుల స్టీల్‌ను వినియోగించారు.
వేడిలేకుండా ప్రత్యేక డిజైన్
అమరులకు గౌరవ సూచికంగా కొవ్వొత్తులు, దీపాలు వెలిగించడం ప్రపంచవ్యాప్తంగా ఆనవాయితీ.. ఈ క్రమంలోనే వెలుగుతున్న దీపం ఆకృతిగల నిర్మాణాన్ని సీఎంకేసీఆర్ ఎంపికచేశారు. చుట్టూ స్టీలు వలయం ఉన్నప్పటికీ భవనం వేడెక్కకుండా ఉండేలా దీన్ని డిజైన్ చేశారు. పఫ్ మెటీరియల్, సపోర్టింగ్ జీఆర్‌సీ(ఫైబర్-రీయిన్‌ఫోర్స్ కాంక్రీట్) షీట్‌లు లోపల ఉష్ణోగ్రతను నియంత్రించటంలో సహాయపడతాయి.
ప్రపంచంలోనే అతిపెద్ద అతుకులులేని స్టెయిన్‌లెస్ నిర్మాణం
అమరుల స్మారకానికి సంబంధించి పాలిష్ చేయబడి ఉబ్బినట్లుగా ఉన్న బాహ్యభాగం పశ్చిమ చైనీస్ నగరమైన కరామేలోని ‘క్లౌడ్ గేట్’, చికాగోలోని ‘బీన్’ నిర్మాణాలను పోలి వుంటుంది. ఇది ప్రత్యేక రాష్ట్రసాధన ఉద్యమ అమరవీరులకు నివాళులర్పించే సంప్రదాయ మట్టి నూనె దీపాన్ని పోలి ఉండటం విశేషం. 161అడుగుల ఎత్తు, 158 అడుగుల వెడల్పుతో ఇది ‘క్లౌడ్ గేట్’ కంటే ఐదారు రెట్లు పెద్దది. ప్రపంచంలో ఇంత పెద్ద అతుకులు లేని స్టెయిన్‌లెస్ స్టీల్ నిర్మాణం మరెక్కడా లేదు.