మంగళగిరి టోల్ గేట్ లో భారీ అగ్నిప్రమాదం

మంగళగిరి టోల్ గేట్ లో భారీ అగ్నిప్రమాదం

గుంటూరు: మంగళగిరి మండలం కాజా టోల్ గేట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. టోల్‌ చెల్లించేందుకు ఆగిన ఓ లారీ హఠాత్తుగా మంటలంటుకుని  ఆహుతి అయిపోయింది. విజయవాడ నుంచి గుంటూరు వైపు వెళ్తున్న లారీ టోల్ గేటులో ఫీజు చెల్లించే సమయంలో మంటలంటుకుంది. అక్కడ పనిచేస్తున్న వారు తేరుకుని మంటలార్పేందుకు ప్రయత్నించినా భారీ ఎత్తున ఎగసిపడుతున్న మంటలను ఆర్పడం సాధ్యపడలేదు. 
టోల్ గేట్ల వద్ద ఈనెల 1వ తేదీ నుంచి ప్రతి వాహనం సెకన్లలో టోక్‌ కట్టే ఫాస్టాగ్‌ పద్ధతి అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. కాని అనేక టోల్‌ గేట్లలో ఇంకా నగదు తీసుకుంటున్నారు. బహుశా అలా క్యాష్‌ చెల్లించేందుకు ఆగిన లారీకి మంటలు అంటుకున్నాయి. లారీ టైర్ పేలిపోవడంతో మంటలు చెలరేగి వెంటనే వ్యాపించినట్లు ప్రత్యక్ష సాక్షుల కథనం. మంటలు అంటుకున్న లారీకి కుడి, ఎడమ వైపుల ఉన్న రెండు టోల్ ఫీజు తీసుకునే క్యాబిన్లకు కూడా మంటలు వ్యాపించి ఆహుతయ్యాయి. వీటిలో పనిచేస్తున్న సిబ్బంది మంటల ధాటికి క్యాష్ క్యాబిన్లలో నుంచి వెంటనే బయటకు వచ్చేశారు.

మంటలు క్షణాల్లో  ఎక్కువ కావడంతో టోల్‌గేట్‌ పై భాగం కూడా అంటుకుంది. క్షణాల్లో దట్టమైన పొగ వ్యాపించడంతో టోల్ గేట్ వద్ద కొద్దిసేపు కలకలం చెలరేగింది. టోల్ గేట్ దాటకుండా రెండు వైపులా వాహనాలు దూరంగానే నిలబడిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపు ఒకలారీ పూర్తిగా కాలిపోగా.. మూడు క్యాష్ క్యాబిన్లు కూడా కాలిపోయినట్లు సమాచారం. ఈ నాలుగు లైన్లు వదిలేసి.. మిగిలిన లైన్ల నుంచి వాహనాలను పంపారు. అగ్నిమాపక సిబ్బందితో మంటలు ఆర్పుతున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.