వర్షాల వల్ల దెబ్బతిన్న బిల్డింగ్‌‌ల వివరాలు సిద్ధం చేయండి : కలెక్టర్ రాహుల్‌‌ రాజ్‌

వర్షాల వల్ల దెబ్బతిన్న బిల్డింగ్‌‌ల వివరాలు సిద్ధం చేయండి : కలెక్టర్ రాహుల్‌‌ రాజ్‌

మెదక్‌‌ టౌన్, వెలుగు: మెదక్​జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాల వల్ల దెబ్బతిన్న, శిథిలావస్థలో ఉన్న హాస్టళ్లు, గురుకుల స్కూళ్లు, కాలేజీ భవనాలకు సంబంధించిన వివరాలను సిద్ధం చేయాలని కలెక్టర్​ రాహుల్‌‌రాజ్‌‌ అన్నారు. గురువారం కలెక్టరేట్‌‌ నుంచి డీఈవో రాధాకిషన్, ఇరిగేషన్, పీఆర్‌‌‌‌ ఈఈలు, జీడబ్ల్యూఐడీసీ డీఈలు, ఏఈలతో కలిసి గురుకుల అధికారులు, ఆర్‌‌‌‌సీవోలతో వీడియోకాన్ఫరెన్స్‌‌లో మాట్లాడారు. 

జిల్లా వ్యాప్తంగా గురుకుల స్కూళ్లు, హాస్టళ్లు, కాలేజీలు 108 ఉన్నాయని.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొన్ని దెబ్బతిన్నాయన్నారు. వాటిని ఇరిగేషన్, పంచాయతీరాజ్ అధికారులు, పరిశీలించి రిపేర్లు చేయాల్సిన వాటిని గుర్తించి నివేదికలు తయారుచేయాలన్నారు.  అంతకుముందు కలెక్టరేట్‌‌లో సెప్టెంబర్ 17న నిర్వహించనున్న ప్రజాపాలన దినోత్సవం ఏర్పాట్లపై సమీక్షించారు. ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లపై అధికారులను దిశానిర్దేశం చేశారు. 

వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

మెదక్​జిల్లాలో రెండు, మూడు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ​రాహుల్‌‌రాజ్‌‌ సూచించారు. గురువారం వర్షానికి వరద నీరు చేరిన మెదక్‌‌లోని బాయ్స్ ఎస్సీ హాస్టల్‌‌, మహిళాపాలిటెక్నిక్​ కాలేజీ పరిసరాలను పరిశీలించారు. 

కలెక్టర్ మాట్లాడుతూ భారీ వర్ష సూచనతో ప్రజలు స్వీయరక్షణ పాటించాలన్నారు.  వరద ప్రవాహ ఉధృతి ఉన్నప్పుడు లోలెవెల్‌‌ కాజ్​వేలు,  బ్రిడ్జిలు దాటే ప్రయత్నం చేయొద్దన్నారు. కలెక్టర్ వెంట జిల్లా ఎస్సీ డెవలప్‌‌మెంట్‌‌ ఆఫీసర్‌‌‌‌ విజయలక్ష్మీ, డీఐఈవో మాధవి, అధికారులు ఉన్నారు.