పదవులు ఆశిస్తున్న నేతలకు ఎదురుదెబ్బ

పదవులు ఆశిస్తున్న నేతలకు ఎదురుదెబ్బ
  • అనుకూలించని రిజర్వేషన్లు
  • ప్రత్యామ్నాయాలపై నాయకుల దృష్టి

మెదక్, వెలుగు: ఎంపీపీ, జడ్పీటీసీ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. దీంతో ఆయా స్థానాల్లో పోటీకి నిలిపేందుకు గెలుపు గుర్రాల ఎంపికపై ప్రధాన రాజకీయ పార్టీలు దృష్టిపెట్టాయి. అంగబలం, ఆర్థిక బలాన్ని పరిగణలోనికి తీసుకొని అభ్యర్థులను ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారు. మరోవైపు జడ్పీ చైర్మన్ పదవి ఆశించిన పలువురు నాయకులకు రిజర్వేషన్లు కలిసి రాకపోవడంతో ఖంగుతిన్నారు. అలాంటి వారిలో కొందరు ఇతర మండలాల నుంచి పోటీ చేయడంపై పార్టీ శ్రేణులతో సమాలోచనలు చేస్తున్నారు. 

జడ్పీ చైర్మన్ జనరల్

మెదక్ జిల్లా పరిషత్ చైర్మన్ పదవి గడిచిన ఎన్నికల్లో బీసీ మహిళకు రిజర్వ్​ కాగా.. ప్రస్తుతం జనరల్ అయింది. జిల్లాలో మొత్తం 21 మండలాలు ఉండగా కొల్చారం, తూప్రాన్, రామాయంపేట జడ్పీటీసీ స్థానాలు జనరల్ అయ్యాయి. పెద్దశంకరం పేట, మనోహరాబాద్, నిజాంపేట జనరల్ మహిళకు రిజర్వ్​అయ్యాయి. 

దీంతో జడ్పీ చైర్మన్ పదవి జనరల్ స్థానాలైన కొల్చారం, తూప్రాన్, రామాయంపేట జడ్పీటీసీలుగా గెలు పొందేవారికి దక్కే అవకాశం ఉంది. లేదంటే జనరల్ మహిళకు రిజర్వ్​అయిన పెద్దశంకరం పేట, మనోహరాబాద్, నిజాంపేట జడ్పీటీసీలుగా గెలుపొందే జడ్పీటీసీలకు ఛాన్స్ ఉంటుంది. ఈ మేరకు అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ తో పాటు బీజేపీ ఆయా స్థానాల్లో బలమైన అభ్యర్థులను నిలిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. 

ఆల్టర్నేట్ ఆలోచన..

ఈ సారి జడ్పీ చైర్మన్ పదవి జనరల్ కాగా అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులకు సొంత మండలంలో రిజర్వేషన్ అనుకూలించ లేదు. నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన ఓ మాజీ ప్రజా ప్రతినిధి గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాకపోవడంతో జడ్పీ చైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఆయన  ఓసీ కాగా సొంత మండలమైన కౌడిపల్లి జడ్పీటీసీ స్థానం బీసీకి రిజర్వ్​ అయింది. దీంతో అనుకూలంగా ఉన్న పక్క మండల జడ్పీటీసీ స్థానంలో పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది.

 జిల్లా స్థాయి నామినేటెడ్ చైర్మన్ పదవి ఆశించి అవకాశం దక్కని గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని మనోహరాబాద్ మండల అధికార పార్టీ నాయకుడు సైతం జడ్పీ చైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఆయన సొంత మండల జడ్పీటీసీ స్థానం జనరల్  మహిళకు రిజర్వ్ కావడంతో ఆలోచనలో పడ్డారు. మెదక్ నియోజకవర్గ పరిధిలోని పాపన్నపేట మండలానికి చెందిన అధికార పార్టీ నాయకులు ఇద్దరికీ జడ్పీటీసీ, ఎంపీపీ రిజర్వేషన్లు అనుకూలంగా రాలేదు. వారు ఓసీ వర్గానికి చెందిన వారు కాగా రెండు స్థానాలు బీసీలకు రిజర్వ్ అయ్యాయి.