బండి సంజయ్ కు దమ్ముంటే కేంద్రం నుండి నిధులు తేవాలి

బండి సంజయ్ కు దమ్ముంటే కేంద్రం నుండి నిధులు తేవాలి

బండి సంజయ్ కు దమ్ముంటే కేంద్రంతో కొట్లాడి నిధులు తేవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం మల్కాపూర్ లో ఏర్పాటుచేసిన గ్రామీణ క్రీడా మైదానాన్ని మంత్రి గంగుల కమలాకర్ తో కలిసి ఆయన ప్రారంభించారు. సీఎం రైతులను ఆదుకోవాలని ఆలోచిస్తున్నప్పుడు పట్టుబట్టి ధాన్యం కొనేలా గంగుల ఒప్పించాడని తెలిపారు. తనకు నచ్చిన సీఎంలు ఎన్టీఆర్, కేసీఆర్ అని..ఎన్టీఆర్ పట్వారీ వ్యవస్థ రద్దు చేసి..పేదలకు 2 రూపాయలకు కిలో బియ్యం ఇస్తే..రైతులకు ఎకరాకు 10 వేలు పెట్టుబడిని కేసీఆర్ ఇస్తున్నారన్నారు.

కాంగ్రెస్, బీజేపీలు అధికారంలో ఉన్న చోట ప్రజలకు చేసిందేమి లేదని విమర్శించారు. తెలంగాణ పోరాటంలో అల్లూరి సీతారామరాజు పాల్గొనడంటూ అమిత్ షా చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఈజేఎస్ కు సంబంధించి కేంద్రం నుండి 800 కోట్ల నిధుల రావాలని మంత్రి చెప్పారు.  కరోనా వల్ల కొత్త ఫించన్లు ఇవ్వలేకపోయామని..వచ్చే నెల నుంచే 57 ఏళ్ళు నిండిన వారికి కొత్త ఫించన్లు ఇస్తామని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పాలనలో గ్రామీణ ప్రాంతాలు ఎంతో బాగుపడ్డాయని..ఇంటింటికి తాగునీరు ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్ అని కొనియాడారు. త్వరలో సొంత స్థలాలున్నవారికి ఇంటి నిర్మాణానికి 3.10 లక్షలు ఇస్తామని ప్రకటించారు. మల్కాపూర్ గ్రామానికి కోటి నిధులు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణ మేమే ఇచ్చామని కాంగ్రెస్ వాళ్ళు చెబుతున్నారు.. మరి దేశానికి స్వాతంత్ర్యం ఇచ్చింది బ్రిటీష్ వాళ్ళే అంటే ఒప్పుకుంటారా? అని ప్రశ్నించారు.

పల్లెల్లో అభివృద్ది చూసి ప్రజలు మురవాలి -గంగుల

పల్లెల్లో అభివృద్ది చూసి ప్రజలు మురవాలన్నది కేసీఆర్ ఆశయమని మంత్రి గంగుల తెలిపారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు..తర్వాత ఎలాంటి మార్పులు వచ్చాయో ప్రజలు గమనించాలన్నారు. పండగ వాతావరణంలో పల్లె ప్రగతి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. టీఆర్ఎస్ వల్లే తెలంగాణ వచ్చిందని అన్నారు. నిధులడిగితే ఆనాటి సీఎంలు వెకిలిగా నవ్వారు కానీ కేసీఆర్ మాత్రం అడిగినన్ని నిధులిస్తున్నట్లు తెలిపారు. గతంలో కలుషిత నీరు తాగి ప్రజలు రోగాల భారిన పడేవారు కానీ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఆ పరిస్థితిలో మార్పు వచ్చిందన్నారు. మన దేశంలో తెలంగాణలో మాత్రమే మిషన్ భగీరథ ద్వారా తాగు నీరు అందిస్తున్నామన్నారు. గతంలో ఆడపిల్ల పెళ్ళికి డబ్బులు దొరకక ఆస్తులమ్ముకుంటే ఇప్పుడు కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ఆడపిల్ల పెళ్లికి లక్ష రూపాయలు ఇస్తున్నట్లు వివరించారు.

 మరిన్ని వార్తల కోసం

నిందితుల ఫోటోలు ఎందుకు చూపించడంలేదు..

కవిగా మారిన హీరో రామ్..ది వారియర్ నుంచి సాంగ్ రిలీజ్