ఉద్యోగాలు రాక, ఉపాధి లేక భ‌‌విష్యత్తుపై ఆందోళన

ఉద్యోగాలు రాక, ఉపాధి లేక భ‌‌విష్యత్తుపై ఆందోళన

ఇటీవల మంత్రి కేటీఆర్ తెలంగాణ ‘కూల్ రూఫ్ పాలసీ’ తీసుకొచ్చారు. గృహ నివాసాలపై వేసవి ఉష్ణోగ్రతల తీవ్రతను తగ్గించి, చల్లదనాన్ని ప్రసాదించేందుకే ‘కూల్‌‌ రూఫ్‌‌ పాలసీ’ ని తెచ్చినట్టు రాష్ట్ర సర్కారు ప్రకటించింది. ఐదేండ్లలో 300 చదరపు కిలోమీటర్ల పరిధిలో కూల్‌‌రూఫ్‌‌ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఐదేండ్ల తర్వాత ఏటా 600 మిలియన్‌‌ యూనిట్ల విద్యుత్తు ఆదా కానుందనేది సర్కారు మాట. ఈ కొత్త పాలసీ ఇండ్లు, భవనాలు, కార్యాలయాలపై వేడిని తగ్గించవచ్చు. ఆ మేరకు కరెంట్ బిల్లు కూడా తగ్గే అవకాశం ఉండొచ్చు. కూల్​ రూఫ్​ పాలసీ మంచిదే. కాదనలేం.. త్యాగాల పునాదులపై ఏర్పడ్డ తెలంగాణలో విద్యార్థులు, నిరుద్యోగ యువత ఉద్యోగాలు లేక.. పేపర్​ లీక్​ లాంటి సమస్యలతో ఆందోళనల్లో ఉంటే భరోసా కల్పించాల్సింది పోయి.. ఎవరు డిమాండ్​ చేశారని ఉన్నపళంగా కూల్​ రూఫ్​ పాలసీ తీసుకొచ్చినట్టు? ప్రజలు డిమాండ్​ చేశారా? రోడ్లెక్కి ధర్నాకు దిగారా? యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పనలో కీలకమైన ‘యూత్ పాల‌‌సీ’ని ప్రకటించడం ఏండ్ల నుంచి యాది మరిచిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు అత్యవసరం కానీ, ఎవరూ అడగని కూల్​ రూఫ్​ పాలసీ తేవడం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నట్టు? 

లీకులపై  నైతికత ఏది?

స‌‌బ్బండ వ‌‌ర్గాలు ప్రాణాల‌‌కు తెగించి కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో యువత ఉద్యోగాలు రాక, ఉపాధి లేక నిరాశా నిస్పృహ‌‌ల‌‌తో నీర‌‌సించిపోయి భ‌‌విష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ పేపర్ లీకేజీ తర్వాత  తెలంగాణ యువతలో నిస్తేజం నిండిన మాట వాస్తవం. వ‌‌ర్సిటీ స్కాల‌‌ర్లు, నిరుద్యోగ యువకులతో మాట్లాడిన చాలా సందర్భాల్లో నాకు ఆ విషయం అర్థమైంది. నాడు ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిని, రబ్బర్​ తూటాలకు ఎదురొడ్డి పోరాడిన ఓయూ విద్యార్థులు, నిరుద్యోగులు.. టీఎస్​పీఎస్సీ పేపర్​ లీక్​పై ఆందోళన చేస్తుంటే ఉక్కు పాదం మోపి అణచివేస్తున్నదీ సర్కారు. తెలంగాణ ఉద్యమాన్ని అవమానించిన, ఉద్యమ ద్రోహులు మాత్రం కీలక పదవుల్లో రాజ్యమేలుతున్నారు. నాడు రాష్ట్రం కోసం పోరాడిన విద్యార్థులు, నిరుద్యోగులు.. నేడు ఉద్యోగాల కోసం స్వరాష్ట్రంలో నిత్యం ఆందోళనలు చేయాల్సిన దుస్థితి ప్రభుత్వానికి కనిపించడం లేదా? వీళ్ల ఆర్తనాదాల కంటే.. కూల్​రూఫ్​ పాలసీ ప్రధాన ప్రాధామ్యం అయిందా? అయినా ఎంత ఘోరం.. ఎంత హేయం.. ఓ ఇద్దరు ముగ్గురు చేసిన త‌‌ప్పుల‌‌కు మేం బాధ్యత వ‌‌హించాల్నా? అంటూ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఎక్కడో రైలు పట్టాలు తప్పితే నైతిక బాధ్యత వహిస్తూ.. రైల్వే మంత్రి రాజీనామా చేసిన ప్రజాస్వామ్య దేశం అన్న సంగతి ఆయనకు తెలియనిది కాదు!.  

9 ఏండ్లలో ఉద్యోగ వసంతం రాలేదు 

ఓ వైపు లీకేజీలతో వచ్చిన కొన్ని నోటిఫికేషన్లు కూడా రద్దయి.. యువ‌‌కులు, ఉద్యోగార్థులు బాధ ప‌‌డుతుంటే.. దేశంలోనే తొలిసారిగా కూల్ రూఫ్ పాల‌‌సీ తెస్తున్నామ‌‌ని, ఈ విధానం దేశానికే ఆద‌‌ర్శవంత‌‌మ‌‌ని.. ఒక రోజు కోస‌‌మో, నెల కోస‌‌మో ఈ పాల‌‌సీని తీసుకురాలేద‌‌ని, ఇది రాష్ట్రానికీ, దేశానికీ ఉప‌‌యోగ‌‌ప‌‌డే మంచి కార్యక్రమం అని సెలవిస్తారు మంత్రివర్యులు. 30 లక్షల మంది జీవితాల‌‌కు భ‌‌రోసా క‌‌ల్పించే అత్యవస‌‌ర విధాన ప‌‌ర‌‌మైన నిర్ణయాన్ని ప‌‌క్కన పెట్టి.. కూల్ రూఫ్ పాల‌‌సీ  మీద అంత‌‌టి శ్రద్ధాస‌‌క్తులు ఎందుకో తెలియదు. సొంత రాష్ట్రం సాధించి 9 వ‌‌సంతాలు దాటుతున్నా.. యువ‌‌త జీవితాల్లో రావ‌‌ల్సిన ఉద్యోగ వ‌‌సంతం రాదేమీ? 

ఓట్లు సీట్ల రాజకీయాలేనా?

ఉమ్మడి రాష్ట్రంలో సీఎంఈవై, వెలుగు, ఉచిత కంప్యూట‌‌ర్ శిక్షణ‌‌, స్పోకెన్ ఇంగ్లీష్ లాంటి చిన్న చిన్న ట్రైనింగ్ లు నిర్వహించి లోన్లు ఇచ్చి గ్రామీణ యువతకు ఉపాధి కల్పించారు. ఉమ్మడి పాలకుల విధానాల్ని తప్పు పడదామా? లేక ఓట్లు సీట్ల రాజకీయాలే తప్ప యువత సంక్షేమం పట్టని ప్రభుత్వం ఉన్నందుకు బాధపడదామా? రాష్ట్ర ప్రభుత్వం వేసిన ప్రతి నోటిఫికేషన్, ప్రతి పరీక్ష ఏదో రకంగా న్యాయపరమైన సమస్యలో ఇరుక్కుంటున్నది. ఏకంగా పబ్లిక్​సర్వీస్​ కమిషన్​లోనే ప‌‌రీక్షా ప‌‌త్రాల లీకేజీల‌‌తో ఉద్యోగాల భ‌‌ర్తీ ప్రక్రియ గంద‌‌ర‌‌గోళంగా మారింది. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే.. కానీ బాధ్యత వహించాల్సిన ప్రభుత్వ పెద్దలు దాటవేసే ధోరణి కనబర్చడాన్ని యువ‌‌త జీర్ణించుకోలేకపోతున్నది. లీకేజీల వ్యవహారంతో ఉద్యోగాల భ‌‌ర్తీలో జాప్యం జరుగుతున్నందున నిరుద్యోగ భృతి అమలు చేయాలన్న క‌‌నీస సోయి లేకపోవ‌‌డం దారుణం. 

బెల్ట్​షాపులు పెరిగినట్లు ఉద్యోగాల భర్తీ పెరగలె

యువత సంక్షేమాన్ని మరచిన ఈ ప్రభుత్వం కార్పొరేషన్ల ద్వారా ఇచ్చే స్వయం ఉపాధి సబ్సిడీ లోన్లు, నిరుద్యోగ భృతికి మంగళం పాడింది. యువత సంక్షేమంపై ఓ విధానం లేని ఈ ప్రభుత్వం మండలానికి నాలుగు వైన్ షాపులు, ఊరికి15 బెల్టు షాపులను మాత్రం అందుబాటులోకి ఉండేలా మద్యం పాలసీని తెచ్చి  యువతను తాగుడుకు బానిసలను చేస్తూ.. ఖజానాను నింపుకుంటున్నది. ఉత్పాదక శక్తిగా, ఉన్నత ఉద్యోగార్థులుగా మారాల్సిన యువత భవిష్యత్తును.. అంధకారంలోకి నెడుతూ విద్యకు దూరం చేస్తున్నది. మత్తుకు అలవాటు చేసి డబ్బిచ్చి అయిదేండ్లకోసారి ఓటేసే యంత్రాలుగా మార్చేసింది.  మహానుభావులు ఏ విషయమైనా ఊరికే చెప్పరు. రూఫ్​ పాలసీ ఏ కంపెనీ లాభాల కోసమో తెలియదు. నిజానికి కూల్​ రూఫ్​లను చాలా మంది ప్రజలు  తమకు తామే చేసుకుంటుంటారు. ఇపుడు ప్రభుత్వ కార్యాలయాలకు తప్పని సరి చేయడం, పెద్ద భవనాలకు తప్పని సరి చేస్తున్నామనడంలోని అంతర్యం ఏమిటో తెలియదు. కానీ నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోవడానికి పాలకులకు తీరిక  లేదు!.

ఉపాధి లోన్ల ఊసేలేదు

రాష్ట్రం సాధించి ఇన్నాళ్లవుతున్నా ఇప్పటి వ‌‌ర‌‌కు యువ‌‌త సంక్షేమం ఆశించి తెచ్చిన ఒక్క విధాన‌‌మూ లేదు. యువత సంక్షేమం కోసం ఉమ్మడి రాష్ట్రంలో అమ‌‌లైన స్వయం ఉపాధికి ఉప‌‌యోగ ప‌‌డే బీసీ, ఎస్సీ, మైనార్టీ కార్పొరేష‌‌న్ లోన్లు మొక్కుబడిగా మంజూరు చేస్తున్నది. నిరుద్యోగ యువ‌‌త పెట్టుకున్న ల‌‌క్షలాది అర్జీలు పెండింగ్​లో ప‌‌డి ఉన్నాయి. ద‌‌ళిత బంధు ఇస్తున్నాం కదా అని.. ఎస్సీ కార్పొరేష‌‌న్ స‌‌బ్సిడీ రుణాల‌‌ను కూడా రాష్ట్ర సర్కారు నిలిపివేసింది. స్వయం ఉపాధి స‌‌బ్సిడీ లోన్లు, స్కిల్ డెవ‌‌ల‌‌ప్ మెంట్ శిక్షణ, ఉపాధిని  ప్రోత్సహించే స్కీమ్ లే లేవు.  పోటీ ప‌‌రీక్షల ప్రిప‌‌రేష‌‌న్ కు కావ‌‌ల్సిన సౌల‌‌తులు క‌‌ల్పన ప్రభుత్వ క‌‌నీస బాధ్యత‌‌. కానీ, తెలంగాణ యువత దురదృష్టమేమో రాష్ట్ర సర్కారు ఇవేవీ ప‌‌ట్టించుకోవ‌‌డం లేదు. 
‘‘ఇండియా - యూకే మధ్య అధికారిక అవగాహన ఒప్పందం కుదిరింది. వాతావరణ మార్పు, క్లీన్ ఎనర్జీ రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని మేము కోరుకుంటున్నాం’’
- డా. జితేంద్ర సింగ్, కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి..
‘‘బీజేపీ డబుల్​ ఇంజిన్​ సర్కారు విఫలమైంది. కాంగ్రెస్ ఎన్నికల హామీలు బీజేపీ తరహాలో ఉండవు. 95 శాతం హామీలను నెరవేర్చాం. కర్నాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని నాకు పూర్తి విశ్వాసం ఉంది’’
- డీకే శివకుమార్, కర్నాటక కాంగ్రెస్ ​అధ్యక్షుడు

‘‘ఎవరి అంచనాలు వారివి. వేటిపైనా నేను స్పందించను. ప్రజల ఆదేశం వెలువడే వరకు వారిని ఆనందించనివ్వండి. కర్నాటకలో పరిస్థితులు ఎలా మారుతున్నాయో వేచి ఉండి చూడండి.’’
- దేవెగౌడ, మాజీ ప్రధాని
-  పరమేశ్వర్ నాగిరెడ్డిపల్లి,సీనియర్ జర్నలిస్ట్