రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేయాలి

రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేయాలి

వరంగల్‍, హసన్‍పర్తి, వెలుగు: రాష్ట్రంలో రైతులతో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేయించాలని, అధికారులు రాజకీయాలు, మొహమాటాలకు పోకుండా జిద్దుగా అమలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‍రెడ్డి ఆదేశించారు. ‘‘ఈజిప్ట్‌‌లో 95 శాతం ఏడారి, కేవలం 05 శాతమే సాగు భూమి ఉన్నా వ్యవసాయంలో ముందుంది. తెలంగాణలో నీరు, కరెంట్‍, పెట్టుబడి ఇచ్చాక కూడా ఆ తరహా ఫలితాలు రావడం లేదు. అవసరానికి మించి వరి పండించడమే దీనికి కారణం” అని అన్నారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‍రావు, సత్యవతి రాథోడ్‍, ఉమ్మడి వరంగల్‍ ఆరు జిల్లాల కలెక్టర్లు, అగ్రికల్చర్‍ ఆఫీసర్లతో రెండు వేదికల్లో వరంగల్‌‌లో మంగళవారం వానాకాలం సాగుకు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిరంజన్‌‌రెడ్డి మాట్లాడారు. సాగులో మార్పులకు అనుగుణంగా రైతాంగాన్ని నడపలేకపోవడం చేతకానితనమవుతుందన్నారు. రైతులతో ఆయిల్‌‌పామ్, అరటి, కంది, పత్తి, తోతాపురి మామిడి వేసేలా అవగాహన కల్పించాలని, వారిని లాభాల బాటలో నడిచేలా చేయాలని సూచించారు. 

యాసంగిలో వరి వద్దంటే వేశారు: ఎర్రబెల్లి

యాసంగిలో వరి వేయొద్దంటే వాళ్లు వీళ్ల మాటలు విని రైతులు వేశారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు అన్నారు. దీంతో రైతుల కోసం సీఎం కేసీఆర్‍ ధాన్యం కొనుగోలు చేశారని చెప్పారు. ఇప్పటివరకు రైతులకు ఎన్‍టీఆర్‍, కేసీఆర్‍ ఇద్దరే మేలు చేశారని చెప్పారు. డిమాండ్‍ ఉన్న పంటలు సాగు చేసేందుకు రైతులు ముందుకు రావాలని సత్యవతి కోరారు. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు న్యాయం చేయలేదంటూ మీటింగ్ వేదిక వద్ద కాంగ్రెస్‍ నేతలు ఆందోళన చేశారు.

నిదానంగా పంటేస్తే నష్టం తప్పదు

రైతులు తమ వ్యవసాయ సీజన్‍ను ముందుకు తెచ్చుకోకుంటే.. గాలివాన, రాళ్లవానను సీఎం ఆపుతడా అంటూ నిరంజన్‌‌రెడ్డి ప్రశ్నించారు. ఏటా మార్చి చివరి వారం, ఏప్రిల్‍ మొదటి వారం నాటికి యాసంగి వరి కోతలు అయిపోతే.. అకాల వానల నుంచి పంటను కాపాడుకునే అవకాశం ఉంటుందన్నారు. అలాకాకుండా నిదానంగా వేసుకొని మే నెల వరకు ఉంటే గాలివాన నుంచి నష్టం తప్పదన్నారు. రాష్ట్ర రైతులకు క్రాఫ్ట్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకువస్తే ఎంతో మేలు జరుగుతుందన్నారు.