22 ఏ దరఖాస్తులపై తక్షణమే తేల్చండి: కలెక్టర్లకు మంత్రి పొంగులేటి దిశానిర్దేశం

22 ఏ దరఖాస్తులపై తక్షణమే తేల్చండి: కలెక్టర్లకు మంత్రి పొంగులేటి దిశానిర్దేశం
  • వారానికోసారి జిల్లా స్థాయిలో సమీక్షించాలి 
  • సమస్యలను హైలెవల్ ​కమిటీకి సిఫార్సు చేయాలి
  • బాధితులకు అన్నివిధాలా న్యాయం జరగాలి
  • ఈ  క్రమంలోనే ప్రభుత్వ ఆస్తులను రక్షించాలి


హైదరాబాద్, వెలుగు: ఏండ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న 22-ఏ భూములకు శాశ్వత పరిష్కారం చూపి బాధితులకు ఉపశమనం కలిగించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఈ దిశగా అధికారులు అప్లికేషన్లను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. గురువారం హైదరాబాద్‌‌లోని సెక్రటేరియెట్‌‌లో హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్–-మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లు, జిల్లా రిజిస్ట్రార్లతో 22-ఏ సమస్యల పరిష్కారంపై మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాలు, జారీ చేస్తున్న జీవోలు కేవలం కాగితాలకే పరిమితం కాకూడదన్నారు. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులన్నింటినీ సత్వరమే  పరిష్కరించాలని, ఏ ఒక్క దరఖాస్తు కూడా అధికారుల వద్ద పెండింగ్‌‌లో ఉండటానికి వీల్లేదన్నారు. అర్హులకు  న్యాయం జరిగేలా జిల్లా కలెక్టర్లు ప్రత్యేక చొరవ చూపి పర్యవేక్షించాలని సూచించారు. 

యూఎల్‌‌సీ ఇష్యూపై హైలెవల్​ కమిటీ అధ్యయనం చేయాలి 

అర్బన్​ల్యాండ్​ సీలింగ్​(యూఎల్‌‌సీ) భూములకు సంబంధించి వివిధ న్యాయస్థానాలు వెలువరించిన తుది తీర్పులు, ప్రభుత్వం తరఫున స్పెషల్ లీవ్ పిటిషన్లు (ఎస్‌‌ఎల్‌‌పీలు) దాఖలు,  ఎస్‌‌ఎల్‌‌పీలు వేయడానికి అవకాశం లేని ఇతర భూములపై రెవెన్యూ శాఖ కార్యదర్శి డీఎస్  లోకేష్‌‌ కుమార్ నేతృత్వంలోని హైలెవల్​కమిటీ సమగ్రంగా అధ్యయనం చేయాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. వారంలోగా ఈ అంశాలన్నింటిపై పూర్తి స్థాయి నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని గడువు విధించారు. ఈ రిపోర్టు అందిన వెంటనే  ఉన్నతస్థాయిలో చర్చించి, ఆయా భూముల క్రమబద్ధీకరణపై (రెగ్యులరైజేషన్) పేద, మధ్యతరగతి ప్రజలకు అనుకూలంగా తగిన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

 జీవో 118, జీవో 76లకు సంబంధించిన అమలు మెమోలు, జీవో 59 అమలుతో పాటు నాలా ప్రక్రియ పూర్తికాని పట్టా భూముల సమస్యల పరిష్కారానికి మార్గం సుగమమైందన్నారు. ప్రత్యేకించి గతంలో 22-ఏ నిషేధిత జాబితాలో చేరినప్పటికీ.. జీహెచ్‌‌ఎంసీ, హెచ్‌‌ఎండీఏ, డీటీసీపీ లేదా స్థానిక మున్సిపాలిటీల నుంచి చట్టబద్ధమైన లేఅవుట్ అనుమతులు పొందిన ఇండ్లు, ఓపెన్ ప్లాట్లు, అపార్ట్‌‌మెంట్ ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేస్తూ స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చినట్టు మంత్రి చెప్పారు. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హత ఉన్న భూముల రిజిస్ట్రేషన్‌‌కు ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. 

బాధితులకు న్యాయం చేస్తూనే ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాలి

22ఏ సమస్యల పరిష్కారం క్షేత్రస్థాయిలో వేగంగా సాగేందుకు పటిష్టమైన పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. ఇందుకోసం ప్రతి వారం జిల్లా స్థాయిలో కలెక్టర్, జిల్లా రిజిస్ట్రార్, ఇతర రెవెన్యూ యంత్రాంగం తప్పనిసరిగా సమావేశమై 22-ఏ దరఖాస్తుల పరిష్కార ప్రగతిని సమీక్షించాలన్నారు. జిల్లా స్థాయిలో పరిష్కారం కాని క్లిష్టమైన సమస్యలను  హైలెవల్​ కమిటీకి సిఫార్సు చేయాలన్నారు.  22ఏ జాబితాలో ఉన్న ప్రతి భూమికి సంబంధించిన సమగ్ర రెవెన్యూ రికార్డులు, రిజిస్ట్రేషన్ చైన్ లింకులు, డాక్యుమెంట్లను అధికారులు నిశితంగా పరిశీలించాలని మంత్రి పొంగులేటి దిశానిర్దేశం చేశారు. 

క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు, భూమి స్వభావాన్ని పూర్తి ఆధారాలతో నిర్ధారించుకున్న తర్వాతే అధికారిక అనుమతులు మంజూరు చేయాలని స్పష్టం చేశారు. నిజమైన పట్టాదారులు, అమాయక కొనుగోలుదారులు తమ ఆస్తులపై పూర్తి హక్కులు పొందేలా కృషిచేయాలని, ఈ విషయంలో అలసత్వం పనికిరాదని తేల్చి చెప్పారు. అదే సమయంలో ప్రభుత్వ భూములు, చెరువు శిఖాలు, దేవాదాయ, వక్ఫ్, ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన భూముల విషయంలో చట్టపరమైన నిబంధనలను నూటికి నూరు శాతం పాటించాలని.. ప్రభుత్వ భూముల పరిరక్షణలో అత్యంత కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్లను మంత్రి పొంగులేటి ఆదేశించారు.