సమస్యలు పరిష్కరించే సత్తా నవీన్ యాదవ్కు ఉంది : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

సమస్యలు పరిష్కరించే సత్తా నవీన్ యాదవ్కు ఉంది : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
  • మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
  • జూబ్లీహిల్స్​లో ఇంటింటి ప్రచారం

జూబ్లీహిల్స్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ డివిజన్ రాజీవగాంధీ నగర్, ప్రతిభా నగర్ లో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు మంత్రి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

 అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ అభ్యర్థి, యువ నాయకుడు నవీన్ యాదవ్ ను గెలిపించుకోవాల్సిన బాధ్యత ఈ ప్రాంత ప్రజలపై ఉందన్నారు. నియోజకవర్గ సమస్యలను పరిష్కరించే సత్తా నవీన్ యాదవ్ కే  ఉందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రహమత్ నగర్ డివిజన్ లో ఉన్న సమస్యలను పరిష్కరించలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సీసీ రోడ్లు, డ్రైనేజీ లైన్లు, అంగన్వాడీ నిర్మాణాల కోసం నిధులు కేటాయించిందన్నారు. 

కాంగ్రెస్​ను సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి: దామోదర

జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు స్థానిక సమస్యలపై అవగాహన ఉందని వాటిని పరిష్కరించడంలో చొరవ తీసుకుంటారని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఎర్రగడ్డ డివిజన్ లోని సుల్తాన్ నగర్, నటరాజ్ నగర్, బి.శంకర్ లాల్ నగర్, నేతాజీ నగర్ లలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేవా అని స్థానికులను అడిగి తెలుసుకున్నారు.

 అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళల కోసం ఉచిత బ‌స్సు ప్రయాణం, 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్, రూ.500కే స‌బ్సిడీ గ్యాస్ సిలిండ‌ర్, సన్న బియ్యం, నూత‌న రేష‌న్ కార్డుల పంపిణీ, ఇందిర‌మ్మ ఇండ్లు వంటి ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. నవీన్ యాదవ్ స్థానికుడు కావడంతో ప్రజల సమస్యలపై పూర్తి అవగాహన ఉందన్నారు. ఎర్రగడ్డలో హస్తం గుర్తుకు అధిక మెజారిటీ ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యే డా.రాజేశ్ రెడ్డి, కార్పొరేటర్ విజయా రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు.