
- బీజేపీ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టిందని ఆరోపణ
హైదరాబాద్, వెలుగు: చత్తీస్ గఢ్ మాజీ మంత్రి కవాసీ లఖ్మాను పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క పరామర్శించారు. రాయ్ పూర్ సెంట్రల్ జైలులో ఉన్న లఖ్మాను బుధవారం ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ తో కలిసి పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం కవాసీ లఖ్మా కుటుంబ సభ్యులను కలిసి సంఘీభావం తెలిపారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా చత్తీస్ గఢ్ లో ఉన్న బీజేపీ ప్రభుత్వం మాజీ మంత్రి, ఆరు సార్లు ఎమ్మెల్యే, ఆదివాసీల అగ్ర నేత కవాసీ లఖ్మాపై నిరాధార కేసులు పెట్టి జైలుకు పంపిందని మంత్రి సీతక్క ఆరోపించారు.
ఎలాంటి సాక్షాధారాలు లేకుండానే తప్పుడు కేసులతో ఆరు నెలలుగా జైలులో పెట్టారని పేర్కొన్నారు. బస్తర్ లో ఆదివాసీల గొంతుకగా వారి సమస్యల పరిష్కారానికి లఖ్మా కృషి చేశారని మంత్రి గుర్తు చేశారు. ఆదివాసీల అణిచివేతలో భాగంగా మాజీ మంత్రిపై కేసులు నమోదు చేశారని ఆమె ఆరోపించారు.