మీ పిచ్చి తగలెయ్యా.. ఫోన్ కోసం కొట్టుకుచావడమేంటిరా..! i Phone 17 కోసం ఎగబడ్డ జనం

మీ పిచ్చి తగలెయ్యా.. ఫోన్ కోసం కొట్టుకుచావడమేంటిరా..! i Phone 17 కోసం ఎగబడ్డ జనం

ఐఫోన్ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తోన్న ఐఫోన్ 17 సిరీస్ ఫోన్ల అమ్మకం ఇండియాలో మొదలైంది. 2025, సెప్టెంబర్ 9న ఐఫోన్ 17 సిరీస్  లాంచ్ అవ్వగా 2025, సెప్టెంబర్ 19 నుంచి ఇండియాలో ఫోన్ల విక్రయాలు స్టార్ట్ అయ్యాయి. ఎన్నో అద్భుతమైన, అడ్వాన్స్‎డ్ ఫీచర్లతో రూపొందించిన  ఐఫోన్ 17 సిరీస్ ఫోన్లు దక్కించుకోవడానికి యాపిల్‌ స్టోర్ల ముందు కొనుగోలుదారులు బారులు తీరారు. 

ఫోన్ల సేల్ శుక్రవారం (సెప్టెంబర్ 19) ఉదయం నుంచి మొదలైతే.. ఎలాగైనా ఫోన్ దక్కించుకోవాలనే పట్టుదల, ఉత్సాహం, ఆతృతతో గురువారం (సెప్టెంబర్ 18) రాత్రి నుంచే యాపిల్ స్టోర్ల ముందు క్యూ కట్టారు ఐఫోన్ ప్రియులు. కస్టమర్లతో తాకిడితో యాపిల్ స్టోర్ల దగ్గర సందడి వాతావరణం నెలకొంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ, ముంబైలోని యాపిల్ స్టోర్లు కస్టమర్లతో కిక్కిరిసిపోయాయి. న్యూ మోడల్ ఫోన్ కోసం విపరీతంగా ఎగబడ్డారు జనం.

ALSO READ : శంషాబాద్లో స్కూల్కు వెళ్లే దారికి అడ్డంగా ప్రహరీ గోడ.. 

మరీ ముఖ్యంగా ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌ స్టోర్‌ బయట కొనుగోలుదారులు అర్ధరాత్రి నుంచే బారులు తీరారు. కిలో మీటర్ల మేర క్యూలో నిల్చున్నారు. ఊహించని రేంజ్‎లో కస్టమర్లు రావడంతో అదుపు చేయలేక స్టోర్ సిబ్బంది చేతులేత్తేశారు. గంటల తరబడి క్యూలో నిల్చున్న కస్టమర్లు ఓపిక నశించి ఒక్కసారిగా స్టోర్‏లోకి ఎగబడటంతో తోపులాట జరిగింది. కొందరు కస్టమర్ల భౌతిక దాడులకు దిగారు. పరిస్థితి అదుపు తప్పడంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగి కస్టమర్లను అదుపు చేశారు.

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌ స్టోర్‌ బయట భారీగా పోలీసులను మోహరించారు. ఐఫోన్ 17 కోసం స్టోర్ల దగ్గర కస్టమర్లు ఎగబడ్డ వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఈ వీడియోలు చూసి పలువురు నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. ‘మీ పిచ్చి తగలెయ్యా.. ఫోన్ల కోసం కొట్టుకుచావడమేంటిరా.. ఇవాళ కాకపోతే రేపు కొనుక్కోవచ్చు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ‘ఇది సార్ ఐఫోన్ రేంజ్’ అంటూ ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఇండియాలో ఐఫోన్ 17 సిరీస్ ధరలు:
 
ఐఫోన్ 17: రూ. 82,900
ఐఫోన్ 17 ఎయిర్ (256GB): రూ. 1,19,900
ఐఫోన్ 17 ప్రో (256GB): రూ. 1,34,900
ఐఫోన్ 17 ప్రో మాక్స్ (256GB): రూ. 149,900