తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు చెవెనింగ్ స్కాలర్‌‌‌‌‌‌‌‌షిప్స్..అంగీకారం తెలిపినబ్రిటన్ ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు చెవెనింగ్ స్కాలర్‌‌‌‌‌‌‌‌షిప్స్..అంగీకారం తెలిపినబ్రిటన్ ప్రభుత్వం
  • సీఎం రేవంత్ రెడ్డితోఆ దేశ హైకమిషనర్ భేటీ
  • విద్య, టెక్నాలజీ, మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిపై చర్చ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రతిష్టాత్మక చెవెనింగ్ స్కాలర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌ను కో-ఫండింగ్ ప్రాతిపదికన అందించేందుకు బ్రిటన్ ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌‌‌‌ జూబ్లీహిల్స్‌‌‌‌లోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డితో భారత బ్రిటిష్ హైకమిషనర్ లిండీ కామెరాన్‌‌‌‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విద్య, టెక్నాలజీ, మూసీ నది అభివృద్ధి వంటి పలు అంశాలపై వారు చర్చించారు.

 విద్య, సాంకేతిక రంగాల్లో తెలంగాణకు పూర్తి సహకారం అందించేందుకు బ్రిటిష్ హైకమిషనర్ సుముఖత వ్యక్తం చేశారు. అలాగే, తెలంగాణ విద్యార్థుల సౌకర్యార్థం యూకే యూనివర్సిటీలు హైదరాబాద్ నుంచి పనిచేసేలా చూడాలని ఆయనను సీఎం కోరారు. రాష్ట్రంలో తీసుకురాబోతున్న కొత్త విద్యా విధానం (ఎడ్యుకేషన్ పాలసీ) ముసాయిదాను సీఎం రేవంత్ రెడ్డి బ్రిటిష్ హైకమిషనర్‌‌‌‌కు వివరించారు.

 రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లకు శిక్షణ ఇచ్చేందుకు కూడా బ్రిటిష్ హైకమిషనర్ సమ్మతించారు. మూసీ నది అభివృద్ధి ప్రాజెక్టులో బ్రిటిష్ కంపెనీలు భాగస్వాములు కావాలని సీఎం కోరగా, దీనికి ఆమె సానుకూలంగా స్పందించారు. జీసీసీ (జీసీసీ), ఫార్మా, నాలెడ్జ్, అకాడమీ వంటి విభాగాల్లో పెట్టుబడులు పెట్టాలని సీఎం కోరగా.. ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశంలో డిప్యూటీ హైకమిషనర్ హైదరాబాద్ గారెత్ విన్ ఓవెన్, పొలిటికల్ ఎకానమీ అడ్వైజర్ నళిని రఘురామన్, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.