కార్పొరేట్లకు అగ్గువకు కూలీలను సప్లై చేసేందుకే.. ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసిన్రు : మంత్రి సీతక్క

కార్పొరేట్లకు అగ్గువకు కూలీలను  సప్లై చేసేందుకే.. ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసిన్రు : మంత్రి సీతక్క
  • జీ రామ్‌‌‌‌ జీ చట్టం ‘ఊపర్  షేర్వానీ.. అందర్  పరేషానీ’లా ఉన్నది: మంత్రి సీతక్క
  • కొత్త చట్టంతో రాష్ట్రాలపై ఆర్థిక భారం
  • పేదలకు ఉపాధి కరువై వలసలు పెరుగుతాయి
  • స్కీమ్‌‌‌‌లకు కేంద్రం ఉత్తరాది పేర్లు పెడుతూ బలవంతంగా రుద్దుతున్నదని ఫైర్​

హైదరాబాద్, వెలుగు:  కార్పొరేట్  కంపెనీలకు అగ్గువకు లేబర్‌‌‌‌‌‌‌‌ను సప్లై చేసేందుకే కేంద్రం ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి,  జీ రామ్‌‌‌‌ జీ చట్టాన్ని తీసుకొచ్చిందని మంత్రి సీతక్క అన్నారు.  దీనివల్ల పేదల జీవితాలు భారంగా మారుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహాత్మాగాంధీ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఈజీఏ)ను యథాతథంగా కొనసాగించాలని మంత్రి సీతక్క శాసన మండలిలో శనివారం తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. ఆమోదం లభించింది.

ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. జీ రామ్‌‌‌‌ జీ చట్టం ‘ఊపర్  షేర్వానీ.. అందర్  పరేషానీ’లాగా ఉన్నదన్నారు.  ఈ చట్టంతో తక్కువ కూలీ ఇచ్చే ఫ్యూడల్ వ్యవస్థ తిరిగి పురుడు పోసుకుంటుందని అన్నారు. కొత్త చట్టంతో రాష్ట్రాలపై ఆర్థిక భారం పడుతుందని, గ్రామాల్లో పేదలకు ఉపాధి కరువై వలసలు పెరుగుతాయని తెలిపారు. పని దినాలు తగ్గి వెట్టి చాకిరీ పెరుగుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలు తీసుకోకుండా కేంద్రం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. పేదలపై నిజమైన ప్రేమ ఉంటే ఉపాధి హామీ బడ్జెట్‌‌‌‌ను, పని దినాలను పెంచాలని కేంద్రాన్ని కోరారు.  పట్టణ ప్రాంత పేదల ఉపాధి కోసం చట్టం తీసుకురావాలని కోరారు.  గాంధీని ద్వేషించడం సరైంది కాదన్నారు. ఉత్తరాది పదాలను తమపై రుద్దితే మేం ఎలా పలుకుతామని ప్రశ్నించారు.

గతంలోకంటే ఎక్కువ నిధులు: బీజేపీ సభ్యుడు ఏవీఎన్‌‌‌‌రెడ్డి

ఉపాధి హామీ పథకానికి కేంద్రం గతంలో కంటే రూ.330 కోట్లు అదనంగా నిధులు  కేటాయించిందని బీజేపీ సభ్యుడు ఏవీఎన్ రెడ్డి తెలిపారు. నిధులు కేంద్రానివా? రాష్ట్రానివా? అనేది అప్రస్తుతమని, ప్రజలకు మేలు కలుగుతుందా? లేదా? అనేదే చూడాలని సూచించారు. ఉపాధి హామీ పథకం పేరు మార్చడంతో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నదని సీపీఐ సభ్యుడు నెల్లికంటి సత్యం అన్నారు. ప్రజల జీవించే హక్కును హరించేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని విమర్శించారు. స్వల్పకాలిక చర్చలో తీన్మార్​ మల్లన్న, మజ్లిస్​ సభ్యుడు రహమత్‌‌‌‌ అలీ బేగ్, కాంగ్రెస్​ సభ్యుడు శంకర్​నాయక్  మాట్లాడారు.

మహాత్ములను మరిపించే ప్రయత్నం: మహేశ్‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ గౌడ్​

బీజేపీ సర్కారు గాంధీ, నెహ్రూలాంటి మహాత్ములను మరిపించే ప్రయత్నం చేస్తున్నదని ఎమ్మెల్సీ మహేశ్​కుమార్‌‌‌‌‌‌‌‌గౌడ్​ అన్నారు. సోనియాగాంధీ అనంతపూర్​ పర్యటనలో పేదల దీన స్థితిని గుర్తించి ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టి.. 20 ఏండ్లు అమలు చేశారని తెలిపారు. ఈ స్కీమ్‌‌‌‌తో 90 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలు లబ్ధి పొందుతున్నారని చెప్పారు. ఇప్పటికే 80 శాతం రాష్ట్రాలు అప్పుల్లో ఉండగా, 40 శాతం వాటా రాష్ట్రం భరించేలా కొత్త చట్టం తేవడం సరైంది కాదని అన్నారు.