అమ్మల సేవలో మంత్రి సీతక్క

అమ్మల సేవలో మంత్రి సీతక్క
  • అంతా తానై చూస్కుంటున్న మంత్రి  
  • అధిక నిధుల మంజూరులో కీలకపాత్ర 
  • మేడారంలోనే అడ్డా వేసి పర్యవేక్షణ
  • జాతర సక్సెస్​ కోసం అనుక్షణం తపన 

వరంగల్ (మేడారం), వెలుగు : ఆదివాసీ గిరిజన వన దేవతల జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంటున్నారు మంత్రి సీతక్క. జాతరకు నిధులు మంజూరు చేయించడం దగ్గరి నుంచి మేడారంలో అభివృద్ధి పనుల పర్యవేక్షణ, సమీక్షలు..సమావేశాలు ఇలా అన్నింటా తానై వ్యవహరిస్తున్నారు. సమ్మక్క 5వ గొట్టుగోత్రానికి చెందిన ఆదివాసీ వంశీకురాలైన సీతక్క బీఆర్ఎస్​ హయాంలో ములుగు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా మూడు నెలల ముందునుంచే ఏర్పాట్లలో నిమగ్నమయ్యేవారు.

ప్రధాన సమస్యలేంటో గుర్తించి ఆ సర్కారు దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పుడు మంత్రి అయ్యాక మరిన్ని బాధ్యతలు మీదేసుకుని పని చేస్తున్నారు. ఏ మాత్రం మంత్రిననే ​దర్పం ప్రదర్శించకుండా సాధారణ గిరిజన ఆడబిడ్డలా కలియతిరుగుతూ ఎక్కడా లోటు పాట్లు లేకుండా చూసుకుంటున్నారు. 4 నెలలుగా మేడారం కేంద్రంగా ఉంటూ జాతర మీదే దృష్టి పెట్టారు.

ఏకంగా రూ.251 కోట్లు

రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్​హయాంలో ఐదు సార్లు జాతర నిర్వహించారు. 2014లో రూ.60 కోట్లు, 2016లో రూ.108 కోట్లు ఇవ్వగా, 2018 రూ. 23 కోట్లు తగ్గించి రూ.85 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఇక 2020, 2022 లో మరింత తగ్గించి రూ.75 కోట్లు మాత్రమే కేటాయించారు. కానీ, కాంగ్రెస్ ​సర్కారు వచ్చాక మంత్రి అయిన ధనసరి సీతక్క ప్రత్యేకంగా సీఎం రేవంత్​రెడ్డిని ఒప్పించి అత్యధిక నిధులు తీసుకువచ్చారు. 2022తో పోలిస్తే రూ.30 కోట్లు పెంచి రూ.105 కోట్లు మంజూరు చేయించారు. ఈసారైతే ఏకంగా రూ.150 కోట్లు తేవడంలో కీలకపాత్ర పోషించారు. రూ.251 కోట్లతో ఆలయ పునురుద్ధరణ, గద్దెల విస్తరణ పనులు చేపట్టడం ద్వారా నయా మేడారాన్ని క్రియేట్‍ చేశారు.