ఇరిగేషన్ భూములను కబ్జాల నుంచి విడిపించండి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఇరిగేషన్ భూములను కబ్జాల నుంచి విడిపించండి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • కబ్జాకు పాల్పడినవాళ్లపై కఠిన చర్యలు తీసుకోండి
  • హైడ్రా, ఇరిగేషన్​, రెవెన్యూ అధికారులకు మంత్రి ఉత్తమ్​ ఆదేశం

హైదరాబాద్​, వెలుగు:  రాష్ట్రవ్యాప్తంగా ఇరిగేషన్​ భూములను కబ్జా చేసిన వాళ్లపై కఠినచర్యలు తీసుకోవాలని, కబ్జా చెరలో ఉన్న ఆ భూములను విడిపించాలని అధికారులను ఇరిగేషన్​ శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి ఆదేశించారు. కబ్జా చెర నుంచి విడిపించిన భూముల చుట్టూ కంచెలను యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేయాలన్నారు. ఇరిగేషన్  శాఖ అధికారులు, హైడ్రా, రెవెన్యూ డిపార్ట్​మెంట్ల అధికారులతో గురువారం సెక్రటేరియెట్​లో మంత్రి ఉత్తమ్​ సమావేశమయ్యారు. రూ. వందల కోట్ల విలువైన ఇరిగేషన్​ భూములను కబ్జా చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించొద్దని తేల్చి చెప్పారు. 

భూముల పరిరక్షణకు సంబంధించి ఎదురయ్యే న్యాయపరమైన సవాళ్లను అధిగమించేందుకు ఇరిగేషన్​ డిపార్ట్​మెంట్​కు ప్రత్యేకంగా ప్రత్యేక ప్రభుత్వ ప్లీడర్​ను నియమించాల్సిందిగా అడ్వకేట్​ జనరల్​ను కోరారు. హైదరాబాద్​ గండిపేట, రాజేంద్రనగర్​లోని వాలంతరీ (వాటర్​ అండ్​ ల్యాండ్​ మేనేజ్​మెంట్​ ట్రైనింగ్​ అండ్​ రీసెర్చ్​ ఇన్​స్టిట్యూట్), తెలంగాణ గ్రౌండ్​ వాటర్​ అండ్​ ఇరిగేషన్​ రీసెర్చ్​ లేబొరేటరీ (టీజీఈఆర్​ఎల్​) భూములు ఆక్రమణకు గురయ్యాయని గుర్తుచేశారు. 426.30 ఎకరాల్లోని 131.31 ఎకరాలు కబ్జాకు గురయ్యాయని ఆయన తెలిపారు. 

కబ్జాకు గురైన భూముల్లో 81.26 ఎకరాలు ఇన్ఫర్మేషన్​ టెక్నాలజీ ఇన్వెస్ట్​మెంట్​ రీజియన్​ (ఐటీఐఆర్​) పరిధిలోకి వస్తాయని, ప్రస్తుతం అవి కోర్టు కేసుల్లో చిక్కుకున్నాయని పేర్కొన్నారు. మిగతా 50.13 ఎకరాలు ఇంకా కబ్జాదారుల చెరలోనే ఉన్నాయన్నారు. జిల్లా కోర్టులో 20 కేసులు పెండింగ్​ ఉన్నాయని చెప్పారు. మరో రెండు కేసులు హైకోర్టు పరిధిలో ఉన్నాయన్నారు. కబ్జాకు గురైన ఇరిగేషన్​ భూములను వీలైనంత త్వరగా విడిపించేందుకు ఇరిగేషన్​ శాఖ, హైడ్రా, రెవెన్యూ, ఆర్​ అండ్​ ఆర్​ విభాగాలు కలిసి పనిచేయాలని మంత్రి ఉత్తమ్​ ఆదేశించారు. రాష్ట్రంలోని ఇరిగేషన్​ శాఖ భూములు, బిల్డింగులు, క్వార్టర్లన్నింటి లెక్కలను తీయాలన్నారు. ఆక్రమణలకు గురైన డిపార్ట్​మెంట్​ క్వార్టర్లను రికవర్​ చేసుకోవాలని తెలిపారు. కబ్జాలకు పాల్పడిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. 

ఇరిగేషన్​ భూముల్లో సోలార్​ ప్లాంట్లు

ఇరిగేషన్​ భూముల్లో సోలార్​ పవర్​ ప్లాంట్ల ఏర్పాటు అంశాన్ని పరిశీలించాల్సిందిగా అధికారులను మంత్రి ఉత్తమ్​ ఆదేశించారు. గత కేబినెట్​ మీటింగ్​లో దీనిపై చర్చించామని గుర్తు చేశారు. వీటి ద్వారా ఉత్పత్తి చేసిన కరెంట్​ను అన్ని లిఫ్ట్​ ఇరిగేషన్​ ప్రాజెక్టులకు వాడుకునే వీలుంటుందని ఆయన అన్నారు.