- రాష్ట్ర-అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని వెల్లడి
కోల్‌బెల్ట్/చెన్నూరు, వెలుగు: చెన్నూరు నియోజకవర్గంలోని అన్ని పంచాయతీల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయాలని, అందుకు పార్టీ లీడర్లు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని మంత్రి వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. మంగళవారం మంచిర్యాల జిల్లా చెన్నూరు క్యాంపు ఆఫీస్‌లో పార్టీ నేతలతో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా చెన్నూరు మండలం కొమ్మెర మాజీ సర్పంచ్, బీఆర్‌ఎస్ గ్రామ అధ్యక్షుడు తాళ్లపెల్లి సత్యనారాయణతో పాటు చెన్నూరు, కోటపల్లి మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన బీఆర్‌ఎస్ లీడర్లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌లో చేరారు. వీరికి మంత్రి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రజా సమస్యలు తీరుతాయన్న నమ్మకంతో వివిధ పార్టీల నుంచి లీడర్లు కాంగ్రెస్‌లో చేరుతున్నారని తెలిపారు. ప్రజా ప్రభుత్వం, వివేక్ వెంకటస్వామి చేస్తున్న అభివృద్ధి పట్ల ఆకర్షితులమై తాము కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వారు చెప్పారు.
మరోవైపు, కాంగ్రెస్ తరఫున పంచాయతీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్న లీడర్లకు మంత్రి దిశానిర్దేశం చేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ గ్రామాలకు చెందిన ఆశావహులు మంత్రిని కలుస్తున్నారు. వారితో మంత్రి మాట్లాడుతూ.. గ్రామాల్లో రాజకీయ సమీకరణాలు, విజయం కోసం అనుసరించాల్సిన వ్యూహాల గురించి తెలియజేశారు. ఆశావహులు, అనుచరులు భారీగా తరలి రావడంతో క్యాంప్ ఆఫీస్ కిక్కిరిసిపోయింది. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు.
