హైదరాబాద్: ప్రజలందరి సహకారంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ మెజారిటీ లక్ష దాటేలా ప్రజలందరూ ఓట్లు వేసి ఆశీర్వదించాలని రాష్ట్ర మైనింగ్, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకట స్వామి కోరారు. కొండాపూర్ మినర్వా కన్వెన్షన్లో జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతుగా కాపు సోదరుల ఆత్మీయ కలయిక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. హైదరాబాద్లో కాపు, మున్నూరు కాపులు అత్యధిక మంది ప్రజలు ఉన్నారని, వారికి సముచిత స్థానం కల్పించాల్సిన అవసరం ఉందని తన తండ్రి వెంకటస్వామి గుర్తు చేసే వారని చెప్పారు.
రానున్న రోజుల్లో బీసీలకు అన్నింటా రిజర్వేషన్ కల్పించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి పొన్నం ప్రభాకర్ కృషి చేస్తున్నారని గుర్తుచేశారు. హైదరాబాద్లో బీసీల జనాభా చాలా ఎక్కువగా ఉందని, అందువల్ల.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో బీసీలకు అవకాశం కల్పించడం జరిగిందని వివరించారు. బీసీలు అందరూ ఒక్క తాటిపైకి వచ్చి జూబ్లీహిల్స్ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపించే అవకాశం సద్వినియోగం చేసుకోవాలని మంత్రి వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు.
జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ పరంగా లీడ్లో ఉందని, ప్రజలందరి సహకారంతో లక్ష మెజార్టీ దాటేలా ప్రజలందరూ ఓట్లు వేసి ఆశీర్వదించాలని మంత్రి కోరారు. ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట్ స్వామి, కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు, శ్యామ్ మోహన్, గాలి అనిల్ కుమార్, బొమ్మ శ్రీరాం చక్రవర్తి.. ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి భారీగా మున్నూరు కాపులు హాజరయ్యారు.
