పార్టీ కోసం కష్టపడ్డ వారికే పదవులు: మంత్రి వివేక్ వెంకటస్వామి

పార్టీ కోసం కష్టపడ్డ వారికే పదవులు: మంత్రి వివేక్ వెంకటస్వామి
  • పార్టీ కోసం కష్టపడ్డ వారికే పదవులు
  • జిల్లా కమిటీలతో కాంగ్రెస్‌‌‌‌కు మరింత బలం
  • జూబ్లీహిల్స్‌‌‌‌లో కాంగ్రెస్‌‌‌‌ విజయం ఖాయం
  • కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్‌‌‌‌ వెంకటస్వామి

కోల్‌‌‌‌బెల్ట్‌‌‌‌/జైపూర్, వెలుగు : పార్టీ కోసం కష్టపడిన వారికే పదవులు దక్కుతాయని కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్‌‌‌‌ వెంకటస్వామి చెప్పారు. మంచిర్యాల డీసీసీ అధ్యక్షుడి ఎంపిక కోసం శుక్రవారం జైపూర్‌‌‌‌లోని పీఎల్‌‌‌‌ఆర్‌‌‌‌ గార్డెన్స్‌‌‌‌లో జరిగిన సంఘటన్‌‌‌‌ సృజన్‌‌‌‌ అభియాన్‌‌‌‌ కార్యక్రమానికి ఏఐసీసీ అబ్జర్వర్‌‌‌‌ నరేశ్‌‌‌‌కుమార్‌‌‌‌తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్‌‌‌‌ వెంకటస్వామి మాట్లాడుతూ... జిల్లా కాంగ్రెస్‌‌‌‌ కమిటీలను సమర్థవంతంగా తీర్చిదిద్దడం, కార్యకర్తల మధ్య సమన్వయం పెంచి పార్టీని బలోపేతం చేయడం అభియాన్‌‌‌‌ ప్రధాన ఉద్దేశ్యమన్నారు. జిల్లా కమిటీలతో పాటు మండల, బ్లాక్‌‌‌‌, గ్రామ స్థాయి కమిటీలను పునరుద్ధరించి పార్టీ స్వరం ప్రతి మూలకు వినిపించేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌ బ్యాక్‌‌‌‌ వాటర్‌‌‌‌ కారణంగా పంటచేలు, నివాస ప్రాంతాలు ముంపునకు గురైతే బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రభుత్వం నష్ట పరిహారం ఇవ్వలేదని విమర్శించారు. ముంపు రైతుల సమస్యలపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాను కొట్లాడానని. చెన్నూరు ఎమ్మెల్యే అయిన తర్వాత రైతుల కోసం రూ.10 కోట్ల పరిహారం మంజూరు చేయించానని చెప్పారు.
 
జూబ్లీహిల్స్‌‌‌‌లో కాంగ్రెస్‌‌‌‌ విజయం ఖాయం

జూబ్లీహిల్స్‌‌‌‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌ నవీన్‌‌‌‌ యాదవ్‌‌‌‌ విజయం ఖాయమని మంత్రి వివేక్‌‌‌‌ వెంకటస్వామి ధీమా వ్యక్తం చేశారు. తాను రెండు నెలల కింద జూబ్లీహిల్స్‌‌‌‌ నియోజకర్గ ఇన్‌‌‌‌చార్జిగా బాధ్యతలు తీసుకున్నానని చెప్పారు. నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో విసృత్తంగా పర్యటించామని, గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఎక్కడా కనిపించలేదన్నారు. కాంగ్రెస్‌‌‌‌ కార్యకర్తలను ప్రోత్సహించి బూత్‌‌‌‌ లెవల్‌‌‌‌ కమిటీలు వేశామని, ప్రజల సమస్యలు తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కరించడం, రోడ్లు, సైడ్‌‌‌‌ డ్రైనేజీలు, అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించడంతో అక్కడి ప్రజలకు కాంగ్రెస్‌‌‌‌పై నమ్మకం ఏర్పడిందన్నారు. జూబ్లీహిల్స్‌‌‌‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌కు ఇప్పటికే ఎనిమిది శాతం ఓట్ల ఆధిక్యం కనిపిస్తోందని, పోలింగ్‌‌‌‌ నాటికి అది 15 శాతానికి పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌‌‌‌ అభ్యర్థి నవీన్‌‌‌‌ యాదవ్‌‌‌‌ 50 వేల ఓట్ల మోజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ 2019 పార్లమెంట్‌‌‌‌ ఎన్నికల్లో ఏడు స్థానాల్లో ఓడిపోయిందని, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పత్తా లేకుండా పోయిందని, తర్వాత పార్లమెంట్‌‌‌‌ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కలేదని, గ్రాడ్యుయేట్‌‌‌‌ ఎన్నికల్లో కనీసం క్యాండిడేట్‌‌‌‌ను కూడా నిలబెట్టలేని స్థితికి చేరుకుందని ఎద్దేవా చేశారు. బీజేపీకి జులైలో 10 శాతం ఓటింగ్‌‌‌‌ ఉండేదని.. ఇప్పుడు ఐదు శాతానికి పడిపోయిందన్నారు. అనంతరం ఏఐసీసీ అబ్జర్వర్‌‌‌‌, పీసీసీ ఆర్గనైజర్లను మంత్రి వివేక్‌‌‌‌ వెంకటస్వామి సన్మానించారు. సమావేశంలో పీసీసీ ఆర్గనైజర్స్ పులి అనిల్‌‌‌‌ కుమార్‌‌‌‌, బత్తిని శ్రీనివాస్‌‌‌‌గౌడ్‌‌‌‌, అడవుల జ్యోతి పాల్గొన్నారు.

పారదర్శకంగా డీసీసీ అధ్యక్షుల ఎన్నిక : 
ఏఐసీసీ అబ్జర్వర్‌‌‌‌ నరేశ్‌‌‌‌ కుమార్‌‌‌‌

కాంగ్రెస్‌‌‌‌ లీడర్లు, కార్యకర్తల ఆమోదంతోనే పారదర్శకంగా డీసీసీ అధ్యక్షుడి ఎంపిక జరుగుతుందని ఏఐసీసీ అబ్జర్వర్‌‌‌‌ డాక్టర్‌‌‌‌ నరేశ్‌‌‌‌కుమార్‌‌‌‌ చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెద్దపీట వేస్తామన్నారు. అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న పలువురికి సంబంధించి కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకునేందుకు నియోజకవర్గాల్లో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.vd