న్యూఢిల్లీ: టెర్రరిస్ట్ గ్రూప్ జైషే మహమ్మద్ మహిళా విభాగం ‘జమాత్ ఉల్ మొమినాత్’కు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ బ్రిగేడ్(జైషే ఉమెన్ వింగ్)లో ఇప్పటిదాకా 5 వేల మందికి పైగా మహిళలు చేరినట్లు జైషే చీఫ్ మసూద్ అజార్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. రిక్రూట్ చేసుకున్న మహిళలందరికీ ఆత్మాహుతి దాడుల గురించి ట్రైనింగ్ ఇస్తున్నామని.. అంతేగాక, మత బోధనలు కూడా చేస్తున్నామని ఒప్పుకున్నాడు.
మసూద్ అజార్ పోస్ట్ ప్రకారం.. తన సోదరి సయీదా నేతృత్వంలో అక్టోబరు 8 న ‘జమాత్ ఉల్ మొమినాత్’ ఏర్పాటు చేశామని తెలిపాడు. మహిళలను టెర్రరిజంలోకి రిక్రూట్ చేసుకుని వారి సాయంతో జైషే మహమ్మద్ గ్రూప్ ను బలోపేతం చేయడమే ఈ బ్రిగేడ్ లక్ష్యమని చెప్పాడు.
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ప్రతి జిల్లాలో ఒక మహిళా అధిపతి నేతృత్వంలో ఓ ప్రత్యేక కార్యాలయం ఉంటుందని.. ఇది వింగ్ కార్యకలాపాలను సమన్వయం చేస్తున్నదని వివరించాడు. అంతేగాక, ఉగ్రవాద సంస్థలోని సభ్యుల భావజాలాన్ని ఏకం చేయడానికి, వారిలో మతం పట్ల భక్తి భావాన్ని పెంపొందించేందుకు ‘జమాత్ ఉల్ మొమినాత్’ కృషి చేస్తుందని రాసుకొచ్చాడు.
