రిటైర్డ్ బొగ్గు ఉద్యోగుల పెన్షన్ పెంచండి

రిటైర్డ్ బొగ్గు ఉద్యోగుల పెన్షన్ పెంచండి

                                                                      
బొగ్గు  ఉద్యోగులు రిటైర్మెంట్ తర్వాత శేష జీవితం ఆరోగ్యంగా, ఆనందంగా గడిపేందుకు స్వర్గీయ కాకా వెంకటస్వామి అప్పట్లో పెన్షన్ పథకం తెచ్చారు. అయితే, 27 సంవత్సరాలు గడుస్తున్నా  ఇంతవరకూ ఈ  పథకంపై మళ్లీ సమీక్ష సవరణ  జరపకపోవడం వలన  ఉద్యోగ విరమణ చేసినరోజు నిర్ధారించిన పెన్షన్​తో జీవితకాలమంతా గడపవలసి వస్తున్నది. దినదినం అన్ని రకాల వస్తువుల  ధరలు పెరుగుతున్నాయి.  వైద్య ఖర్చులు కూడా  ఆకాశాన్ని అంటుతున్నాయి. చాలీచాలని  అతి తక్కువ  పెన్షన్​తో  బతకడమే భారం అవుతున్నది.  వంశీకృష్ణ  పార్లమెంట్ 
సభ్యునిగా ఎన్నికైన తర్వాత పెద్దపల్లి నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా అనేక అభివృద్ధి పనులను చేపడుతున్నారు. అదేవిధంగా పెద్దపల్లి మంచిర్యాల తదితర స్టేషన్లలో ముఖ్యమైన రైళ్లకు హాల్టులు ఏర్పాటు చేయించినారు.  వారి చిత్తశుద్ధి అంకిత భావానికి ఇవి నిదర్శనం. అంతేకాకుండా  రామగుండం  ప్రాంతంలో విమానాశ్రయాన్ని  నెలకొల్పుటకు  నిరంతరం కృషి  చేస్తున్నారు. నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేనున్నానని వెంటనే వారి ఇళ్ల వద్దకు చేరుకొని కష్టసుఖాలను తెలుసుకుంటున్నారు.  ఆదుకుంటున్నారు కూడా.  ఇదే స్ఫూర్తితో బొగ్గు ఉద్యోగుల పెన్షన్ పెంచుటకు ఎంపీ వంశీకృష్ణ కృషి చేస్తారని,  కాకా వెంకటస్వామి వారసునిగా తాత అందించిన ప్రసాదాన్ని కడుపునిండా భోజనంగా విస్తరిస్తారని ఆశిస్తున్నాం.  వారికి ఇదే మా విజ్ఞప్తి.  ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశాలలో బొగ్గు ఉద్యోగుల పెన్షన్  పెంచుటకు  వంశీ కృష్ణ ప్రభుత్వాన్ని ఒప్పించి ఒక ప్రకటన చేయిస్తారని దేశంలోని  లక్షల మంది బొగ్గు  రిటైర్డ్ ఉద్యోగులు వారిపై అత్యంత  విశ్వాసంతో ఎదురు చూస్తున్నారు.

‌‌‌‌‌‌‌‌- దండంరాజు రాంచందర్ రావు, 
అధ్యక్షుడు,  సింగరేణి 
రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్