నల్లబెల్లి/నర్సంపేట, వెలుగు : పంచాయతీ ఎన్నికల్లో పదవి కోసం కుటుంబసభ్యులే ఒకరిపై ఒకరు పోటీకి దిగుతున్నారు. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలో వార్డు సభ్యురాలి పోస్ట్ కోసం తల్లీకూతుళ్లు పోటీ పడుతున్నారు. గ్రామంలోని ఐదో వార్డు మహిళకు రిజర్వ్ అయింది. దీంతో బీజేపీ తరఫున ఒక్కోజు సరోజన నామినేషన్ వేయగా.. బీఆర్‌ఎస్ నుంచి ఆమె కూతురు ముషిక సౌజన్య బరిలో నిలిచింది. తల్లీకూతురు వేర్వేరు పార్టీల తరఫున పోటీ చేయడం చర్చనీయాంశంగా మారింది.
వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ఇటుకాలపల్లిలో తోటికోడళ్లు పోటీ పడుతున్నారు. నర్సంపేట మండలం ఇటికాలపల్లి గ్రామ సర్పంచ్ స్థానం కోసం బీఆర్‌ఎస్ తరఫున తాళ్లపల్లి అశోక్ భార్య మమత పోటీ చేస్తుండగా.. బీజేపీ తరఫున అశోక్ తమ్ముడు రాము భార్య కల్పన బరిలోకి దిగింది. వీరి సమీప బంధువైన మెరుగు శ్రీనివాస్ భార్య సుమలత కూడా కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తోంది. దీంతో ఈ గ్రామంలో ఎన్నికలు చర్చనీయాంశంగా మారాయి.
