Akhanda2: చివరి నిమిషంలో అఖండ 2 రిలీజ్‌‌కు బ్రేక్.. అభిమానులు రియాక్షన్ ఎలా ఉందంటే?

Akhanda2: చివరి నిమిషంలో అఖండ 2 రిలీజ్‌‌కు బ్రేక్.. అభిమానులు రియాక్షన్ ఎలా ఉందంటే?

‘సినిమా ఆగిపోయింది.. కానీ, అభిమానులు అంచనాలు ఆగలేదు..’‘చివరి నిమిషం ప్రకటన నిరాశ ఇచ్చిన.. బాలయ్య విధ్వంసం నిరాశ పరచదు’.. అఖండ 2 ఎప్పుడొచ్చినా అరాచకం తప్పదు అంటున్నారు బాలయ్య ఫ్యాన్స్. ఇవాళ శుక్రవారం (డిసెంబర్ 5న) విడుదల కావాల్సిన ‘అఖండ 2’ అనూహ్య పరిణామాల నడుమ వాయిదా పడింది. ఈ వాయిదా ప్రకటన.. ఎన్నో ఆశలతో ఎదుచూస్తున్న అభిమానులని ఎంతో బాధపెట్టింది. అయినప్పటికీ.. వారిలో అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అయితే, కొన్నిచోట్ల మాత్రం బాలకృష్ణ అభిమానులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.

సినిమా రిలీజ్ ముందురోజు వరకు కూడా బాలయ్య కష్టపడి ప్రమోషన్స్ చేశాడు. అంతకుమించి సినిమా పూర్తిచేయడం కోసం తాండవం చేశాడు. అలాంటిది మేకర్స్ మాత్రం చివరి క్షణంలో సినిమాని నాశనం చేసారని మండిపడుతున్నారు. వారం ముందునుంచే థియేటర్ల వద్ద అభిమానుల హంగామా అంతా ఇంతా కాదు. పోస్టర్స్.. కటౌట్స్ కట్టడం నుంచి.. ప్రీమియర్స్ టికెట్లు తెంచాలనే గట్టి సంకల్పంతో వచ్చారు. ఇలా సడెన్గా ప్రీమియర్స్ ఆపేశారంటే ఏదో టెక్నికల్ ఇష్యూ అనుకోవొచ్చు. కానీ, ఇలా అర్ధాంతరంగా సినిమా విడుదల ఆపేస్తే.. ఎలా ఉంటుందనీ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

అయితే, ఈ చిత్రాన్ని నిర్మించిన 14 రీల్స్‌‌ ప్లస్‌‌ నిర్మాతలు ‘అనివార్య పరిస్థితలే’ విడుదల వాయిదాకి కారణం అని చెప్పినా.. నిజానికి ఆర్ధిక లావాదేవీలే ఆలస్యానికి ప్రధాన కారణమని టాక్. 14 రీల్స్‌‌ ప్లస్‌‌ సంస్థ తమకు రూ.28 కోట్ల బకాయి ఉందని, ఆ మొత్తం చెల్లించేవరకు సినిమాను నిలిపివేయాలని మద్రాస్ హైకోర్టులో బాలీవుడ్‌‌ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్‌‌ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. రిలీజ్​ను ఆపుతూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. ఈ సమస్య కేవలం రూ.28 కోట్లకు సంబంధించినది కాదని, దానిపై ఆరేళ్ల వడ్డీ కలిపి దాదాపు రూ.50 కోట్లు ఉంటుందని సినీ వర్గాలు అంటున్నాయి.

ఈ క్రమంలోనే 14 రీల్స్ సంస్థతో లావాదేవీలు ఉన్న మరికొందరు కూడా తమ అప్పులు తీర్చాలని ఒత్తిడి పెంచినట్లు కూడా టాక్ ఉంది. అలా 14 రీల్స్‌‌ ప్లస్‌‌ సంస్థ మొత్తం రూ.70 కోట్లకు పైగా లావాదేవీలు పరిష్కరించాల్సిన పరిస్థితి ఏర్పడిందని సినీ వర్గాల నుంచి బలంగా వినిపిస్తుంది. ఎదేమైనా.. ఒక సినిమా అంటే వ్యాపారం మాత్రమే కాదు.. ఎంతో మంది నిరీక్షణ కూడా. డబ్బులు పెట్టిన నిర్మాతకు లాభాలిచ్చేది అభిమానులే. ఇది నిజం. ఒకవేళ అభిమానులు చూడటం ఆపేస్తే లాస్ అయ్యేది నిర్మాత మాత్రమే కాదు.. సినిమాను నమ్ముకున్న టెక్నీషియన్స్, నటులు, 24 విభాగాల క్రాఫ్ట్స్ కూడా!