- పార్లమెంట్ ఆవరణలో ప్రతిపక్ష సభ్యులతో కలిసి సోనియా ఆందోళన
- వాయు కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్‌ను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర సర్కారును కాంగ్రెస్ అగ్ర నేత సోనియాగాంధీ డిమాండ్ చేశారు. ఏదో విధంగా సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని అన్నారు. దేశ రాజధానిలో పొల్యూషన్ సమస్యపై గురువారం పార్లమెంట్ కాంప్లెక్స్‌లో వివిధ ప్రతిపక్ష పార్టీల నాయకులు నిరసన ప్రదర్శన నిర్వహించారు.
మకర్ ద్వార్ వెలుపల ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. శీతాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా.. ‘వాతావరణాన్ని ఆస్వాదించండి’ అంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ ఓ బ్యానర్‌ను ప్రదర్శించారు. ప్రధాని మోదీ మాటలు ఆపి.. సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ మాట్లాడుతూ..‘‘ఎయిర్ పొల్యూషన్‌తో పిల్లలు చనిపోతున్నారు కాబట్టి ఏదో ఒకటి చేయాల్సిన బాధ్యత కేంద్ర సర్కారుపై ఉన్నది. నా లాంటి వృద్ధులు కూడా ఇబ్బంది పడుతున్నారు” అని అన్నారు.
జనం ఇబ్బందుల్లో ఉంటే.. వెదర్ ను ఆస్వాదించాలా?: ఖర్గే
ఢిల్లీలో వాయు కాలుష్యంతో అందరూ ఎందుకు బాధపడుతున్నారని అడిగితే.. ‘వాతావరణాన్ని ఆస్వాదించండి’ అని మోదీ అంటున్నారని రాజ్యసభ ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. విషపూరితమైన గాలిపై బీజేపీ ఉదాసీనతకు వ్యతిరేకంగా పార్లమెంట్‌లో నిరసన తెలుపుతున్నాం అంటూ ‘ఎక్స్’లో ఓ వీడియో షేర్ చేశారు.
