
- రూ.700 కోట్ల దాకా దుర్వినియోగం!
- సరిగా చేయని పనులకు ఎక్కువ మొత్తంలో ఖర్చు
- గుర్తించిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు
- రికవరీ చేయాలని రాష్ట్రానికి కేంద్ర సర్కారు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఉపాధి హామీ పనులు నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్నాయి. తూతూ మంత్రంగా చేసిన పనులకు సర్కారు ఎక్కువ మొత్తంలో నిధులు ఖర్చు చేస్తోంది. ఆ విధంగా దాదాపు రూ.700 కోట్ల దాకా నిధులు దుర్వినియోగం అయినట్లు తెలిసింది. దీనిపై కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ.. తెలంగాణ సర్కారుపై సీరియస్ అయింది. రూల్స్‌కు వ్యతిరేకంగా చేపట్టిన ఉపాధి హామీ పనులను వెంటనే ఆపాలని ఆదేశించింది. దుర్వినియోగమైన నిధులను రికవరీ చేయాలని స్పష్టం చేసింది.
12 గ్రామాల్లోనే ఇన్ని లోపాలా?
గత నెల 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు కేంద్ర రూరల్ డెవలప్మెంట్ అధికారుల బృందం రాష్ట్రంలో పర్యటించింది. ఉపాధి హామీ కింద ఎలాంటి పనులు చేపట్టారు? పనులు ఎలా జరిగాయి? ఖర్చయిన నిధులెన్ని? రికార్డుల మెయింటనెన్స్ తదితర వివరాలను ఫీల్డ్ లెవల్‌కు వెళ్లి పరిశీలించారు. 5 జిల్లాల్లోని 12 గ్రామాల్లో ఉపాధి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. వీటిలో అనేక అవకతవకలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. కొన్ని పనులకు రికార్డుల్లో అంచనా వ్యయం ఎక్కువగా చూపడం, ఫీల్డ్‌లో చూస్తే తక్కువ ఖర్చు జరిగినట్లు గమనించారు. మూడ్రోజుల పర్యటనలో ఉపాధి పనులపై పూర్తి రిపోర్టును తయారు చేసిన అధికారులు.. రాష్ట్ర ప్రభుత్వానికి గురువారం లేఖ రాశారు. అప్పటికే పని పూర్తయిన ప్రాంతంలో మరోసారి అదే పనికోసం ఉపాధి నిధులు ఖర్చు చేసినట్లు గుర్తించామని లేఖలో పేర్కొన్నారు. ఉపాధి హామీ కింద మైక్రో ఇరిగేషన్ ట్యాంకుల పనులపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వాటిని ఆపేయాలని, నిబంధనలకు విరుద్ధంగా చేసిన ఖర్చులను రికవరీ చేయాలని సూచించారు. 12 గ్రామాల్లోనే పరిస్థితి ఇట్లుంటే.. రాష్ట్రమంతటా ఇంకెట్లుందోనని అధికారులు ఆందోళన వ్యక్తంచేశారు.
కాంట్రాక్టర్‌కు అప్పగించిన్రు
రాష్ట్ర ప్రభుత్వం నరేగా నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన ఫుడ్ గ్రెయిన్స్ డ్రయింగ్ ఫ్లాట్‌ఫామ్స్ పనులను వెంటనే ఆపేయాలని కేంద్రం ఆదేశించింది. ఇప్పటికే 22,613 పూర్తయ్యాయని చెప్పారని, ఇంకో 17,250 నిర్మాణంలో ఉన్నాయని నివేదించారని.. వాటన్నింటినీ ఆపేయాలని ఆదేశించింది. మొత్తం రూ.380 కోట్ల ఖర్చుకు గాను ఇప్పటికే చేసిన ఖర్చురూ.150 కోట్లు ఉందని ఆ మొత్తం రికవరీ చేయాలంది. ట్రీగార్డులు, ఆర్డినరీ ట్రెంచ్‌లు, అర్హత లేని ప్రైవేటు జాగలలో పనులు చేయించడం వంటివి ఉపాధి పనులకు విరుద్ధమని లేఖలో కేంద్ర గ్రామీణాభివృద్ధి అధికారులు స్పష్టం చేశారు. అలాంటివాటిపై పెట్టిన ఖర్చు మొత్తాన్ని రికవరీ చేయాలన్నారు. సిమెంట్, కాంక్రీట్ రోడ్డు పనుల్లో థర్డ్ పార్టీకి పని అప్పగించారని, పేమెంట్లు చేశారని గుర్తుచేశారు. ఆ పనులూ ఈ స్కీం స్ఫూర్తికి విరుద్ధమని తెలిపారు. ఉపాధి హామీ పనుల్లో ఎలాంటి కాంట్రాక్టర్ ఉండకూదని స్పష్టంగా ఉన్నప్పటికీ నిబంధనలను ఉల్లంఘించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. 30 రోజుల్లోగా ఆ పనుల పైసలు రికవరీ
చేయాలని స్పష్టం చేశారు.