
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న మిషన్ భగీరథ సర్వే చివరి దశకు చేరుకుంది. ఇప్పటి వరకు 80 శాతం సర్వే పూర్తయిందని అధికారులు చెబుతున్నారు. ఇంటింటికి వెళ్లి ఆధార్, ఫోన్ నంబర్ తీసుకుంటున్నామని తెలిపారు. సర్వే పూర్తయ్యాక వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 54 లక్షల నల్లాలను స్కీమ్ స్టార్ట్ అయినపుడు ఏర్పాటు చేశామని, ఇందులో ఎక్కువ శాతం నీళ్లు రాక, చాలా వరకు రిపేర్లు వచ్చాయని, కొన్ని నిరుపయోగంగా ఉన్నట్లు సర్వేలో వెల్లడి అయిందని పేర్కొన్నారు.
కొత్త జిల్లాలతో పాటు చాలా జిల్లాల్లో కొత్త గ్రామాలు, ఆవాసాలు , ఊర్ల నుంచి మెయిన్ రోడ్లకు దగ్గరగా ఇండ్లు నిర్మించుకున్నారని, వాటిలో కొత్త నల్లాలు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. వీటితో పాటు ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ పెద్ద ఎత్తున కొత్త నిర్మాణాలు, కాలనీలు ఏర్పాటయ్యాయని వెల్లడించారు. సర్వే రిపోర్టును కేంద్ర జలశక్తి శాఖకు ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. జలజీవన్ స్కీమ్ ద్వారా వచ్చే నిధులతో నల్లాలు లేని చోట కనెక్షన్లు ఏర్పాటు చేస్తామని, అన్ని ఇండ్లకు నీళ్లు అందేలా చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.