రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది : ఎమ్మెల్యే బొజ్జు పటేల్

రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది : ఎమ్మెల్యే బొజ్జు పటేల్
  • సదర్ మాట్ నీటి విడుదల

ఖానాపూర్, వెలుగు: రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అన్నారు. ఖానాపూర్, కడెం మండలాల రైతులకు వానకాలం పంటల సాగు కోసం సదర్ మాట్ అనకట్ట ఎడమ కాలువ ద్వారా బుధవారం సాగు నీటిని ఎమ్మెల్యే విడుదల చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సదర్​మాట్ కాలువలకు త్వరలో లైనింగ్ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేసిందన్నారు. రైతులు నీటిని వృథా చేయకుండా జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచించారు. 

రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రకియ

అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులను అందిస్తామని, ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని ఎమ్మెల్యే అన్నారు. ఖానాపూర్ మండలం సత్తనపల్లిలోని రైతు వేదికలో కలెక్టర్ అభిలాష అభినవ్ తో కలిసి లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేశారు. 

పేదల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెడుతోందని పేర్కొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ  మండలంలో మొత్తం 1,669 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశామన్నారు. మైనార్టీ శాఖ ఆధ్వర్యంలో ఇందిరా మహిళా పథకం కింద మంజూరైన కుట్టు మెషన్లను మహిళలకు పంపిణీ చేశారు. అధికారులు, స్థానిక నేతలు పాల్గొన్నారు.