కొనుగోళ్లలో ఆలస్యానికి అధికారులదే బాధ్యత : పాల్వాయి హరీశ్ బాబు

కొనుగోళ్లలో ఆలస్యానికి అధికారులదే బాధ్యత : పాల్వాయి హరీశ్ బాబు

కాగజ్ నగర్, వెలుగు: కొనుగోలు కేంద్రాల్లో రైతుల వడ్లను కుప్పలుగా పోసి రోజులు గడుస్తున్నా కొనడంలేదని, అధికారుల నిర్లక్యంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని సిర్పూర్ టీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు విమర్శించారు. వడ్ల కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ శుక్రవారం కౌటాల మండలం ముత్యంపేట్, సిర్పూర్ టీ మండలం పారిగాంలో రైతులు చేపట్టిన ధర్నాకు మద్దతు తెలిపారు. రోడ్డుపై కూర్చొని రాస్తారోకో చేశారు. రైతుల పండించిన ధాన్యం అకాల వర్షానికి తడిసిపోతున్నా.. అధికారులు మాత్రం మాయిశ్చర్, తప్ప తాలు పేరుతో కొనుగోళ్లలో ఆలస్యం చేస్తూ రైతులను నట్టేట ముంచుతున్నారని మండిపడ్డారు. అకాల వర్షాలతో  నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ ​చేశారు. 

జిల్లాలో 60 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం పండితే ఇప్పటివరకు 3500 మెట్రిక్ టన్నులు కూడా కొనలేదని ఆరోపించారు. అడిషనల్ కలెక్టర్ డేవిడ్ వచ్చి కొనుగోళ్లను వేగవంతం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం, జిల్లా కార్యదర్శి రాజేందర్ గౌడ్, మండల అధ్యక్షురాలు లావణ్య, మాజీ జడ్పీటీసీ ఎల్ములే మల్లయ్య, మాజీ ఎంపీటీసీ మోతీరాం, ఒడ్డేటి నాని, కుంచాల సత్తయ్య, శివరాం, నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు. రైతుల ధర్నా తో ట్రాఫిక్ జామ్ ఏర్పడగా డిగ్రీ పరీక్షలకు హాజరయ్యే స్టూడెంట్లు గూడ్స్ వాహనాల్లో ఎక్కి వెళ్లారు.

తడిసిన జొన్నలను ప్రభుత్వమే కొనాలి

నేరడిగొండ, వెలుగు: రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు జొన్నలు తడిసిపోయాయని, వాటిని ప్రభుత్వమే కొనాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ డిమాండ్ ​చేశారు. నేరడిగొండ మండలంలోని ప్రాథమిక వ్యవసాయ కేంద్రంలో నిర్వహిస్తున్న కొనుగోలు సెంటర్ లో తడిసిన జొన్నలను శుక్రవారం ఆయన బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. కొనుగోళ్లను స్పీడ్​గా చేపట్టకపోవడంతోనే జొన్నలు తడిసి రైతులు నష్టపోయే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. 

తడిసిన ప్రతీ గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు ఆందోళన చెందవద్దన్నారు. అనంతరం నియోజకవర్గంలోని పలువురు లబ్ధిదారులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మండల కేంద్రంలోని ఆయన ఇంట్లో అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు ప్రీతంరెడ్డి, తుల శ్రీనివాస్, ఇచ్చోడ మండల కన్వీనర్ కృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ సురేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.