- ఎమ్మెల్యే కోరం కనకయ్య
ఇల్లెందు, వెలుగు : ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర కంటే తక్కువకు పంటను కొనుగోలు చేయాలని చూస్తే సహించేది లేదని ఎమ్మెల్యే కోరం కనకయ్య హెచ్చరించారు. సోమవారం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుడారు. ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.2,400 ధర నిర్ణయించినప్పటికీ కమ్యూనిస్టు నేతలు సొంతగా ఓ రేటును నిర్ణయించడం సరికాదన్నారు. పేదోళ్లను కొట్టి దళారులకు దోచి పెట్టడం ఏంటని ప్రశ్నించారు. కమ్యూనిస్టు నేతలు సమాజానికి ఏమీ సమాధానం చెబుతారో చెప్పాలని డిమాండ్‌చేశారు.
కాంగ్రెస్ నిరంతరం ప్రజల కోసం ఆలోచించే ప్రజా ప్రభుత్వమన్నారు. చెడును పారద్రోలడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇప్పటికైనా కమ్యూనిస్టు నేతలు తమ పద్ధతి మార్చుకోవాలని హితవుపలికారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ రాంబాబు, పీఏసీఎస్ చైర్మన్ మెట్ల కృష్ణ, వ్యవసాయశాఖ అధికారి సతీశ్, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి..
టేకులపల్లి, వెలుగు : ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతుల సద్వినియోగం చేసుకోవాలని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య సూచించారు. బేతంపూడి సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న, వరి కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు దళారులను ఆశ్రయించి మోసపోకుండా, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకుడు కోరం సురేందర్, ఇల్లందు మార్కెట్ కమిటీ చైర్మన్ రాంబాబు నాయక్, బేతంపూడి సొసైటీ చైర్మన్ లక్కినేని సురేందర్ రావు, ఆత్మ కమిటీ చైర్మన్ మంగీలాల్ నాయక్, ఎంపీడీవో మల్లేశ్వరి, ఏవో అన్నపూర్ణ, సొసైటీ సీఈవో ప్రేమాచారి, అధికారులు, నాయకులు పాల్గొన్నారు
