బీజేపీది ఓటు చోరీ.. కాంగ్రెస్ ది యూనియన్ చోరీ : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు 

బీజేపీది ఓటు చోరీ.. కాంగ్రెస్ ది యూనియన్ చోరీ  : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు 
  • తెలంగాణ వర్కర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యూనియన్‌‌‌‌‌‌‌‌కు కాంగ్రెస్​ మద్దతివ్వడం ఏంటీ?: కూనంనేని 

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: దేశంలో బీజేపీ ఓట్లు చోరీ చేస్తుంటే, రాష్ట్రంలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ యూనియన్ల చోరీ చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ఆదివారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని మగ్ధూంభవన్‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

కమ్యూనిస్టుల మద్దతు ఉన్న ఆర్టీసీ ఎంప్లాయీస్‌‌‌‌‌‌‌‌ యూనియన్‌‌‌‌‌‌‌‌ను ఓడించేందుకు అధికార కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ అన్యాయంగా మరో యూనియన్‌‌‌‌‌‌‌‌కు మద్దతిస్తోందని ఆరోపించారు. గతంలో ఒక యూనియన్‌‌‌‌‌‌‌‌కు కేటాయించిన గుర్తును నిబంధనలకు విరుద్ధంగా మరో యూనియన్‌‌‌‌‌‌‌‌కు కేటాయించారని మండిపడ్డారు. ఈ అక్రమాలను నిరసిస్తూ సోమవారం లేబర్‌‌‌‌‌‌‌‌ కమిషనర్‌‌‌‌‌‌‌‌ కార్యాలయం ముందు భారీ నిరసన చేపడతామని ప్రకటించారు.

ఆర్టీసీతో ఏఐటీయూసీకి పేగుబంధం

ఆర్టీసీ పుట్టుక నుంచి కార్మిక ఉద్యమాలతో ఏఐటీయూసీకి విడదీయరాని పేగుబంధం ఉందన్నారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ తన అనుబంధ సంఘమైన ఐఎన్‌‌‌‌‌‌‌‌టీయూసీని కాదని, తెలంగాణ వర్కర్స్‌‌‌‌‌‌‌‌ యూనియన్‌‌‌‌‌‌‌‌కు మద్దతు ఇవ్వడం వెనుక పెద్ద రాజకీయ కుట్ర ఉందని ధ్వజమెత్తారు. కమ్యూనిస్టుల మద్దతు ఉన్న యూనియన్‌‌‌‌‌‌‌‌ గెలవకూడదనే దురుద్ధేశంతోనే కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ గెలుపునకు కార్మికులు ఎంతో కష్టపడ్డారని, ఇప్పుడు వారి సంఘాల విషయంలోనే రాజకీయ జోక్యం చేసుకోవడం తగదని హితవు పలిపారు.

ఎవరి సంఘాన్ని వారు బలోపేతం చేసుకోవాలి తప్ప, ఒకరిని ఓడించడానికి వేరే వారికి మద్దతు ఇవ్వడం అన్యాయమన్నారు. ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలను స్వేచ్ఛగా, ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఎన్ని కుట్రలు చేసినా ఈ ఎన్నికల్లో చివరకు ఎర్రజెండానే విజయం సాధిస్తుందని కూనంనేని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఎంప్లాయీస్‌‌‌‌‌‌‌‌ యూనియన్‌‌‌‌‌‌‌‌ రాష్ట్ర అధ్యక్షుడు బాబు, ప్రధాన కార్యదర్శి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.