100 పడకల ఆస్పత్రిని వర్ధన్నపేటలోనే నిర్మిస్తాం : ఎమ్మెల్యే నాగరాజు

100 పడకల ఆస్పత్రిని వర్ధన్నపేటలోనే నిర్మిస్తాం :  ఎమ్మెల్యే నాగరాజు
  • అఖిలపక్ష నాయకులకు ఎమ్మెల్యే నాగరాజు హామీ 

వర్ధన్నపేట, వెలుగు:100 పడకల ఆస్పత్రిని వర్ధన్నపేటలోనే నిర్మిస్తామని ఎమ్మెల్యే నాగరాజు తెలిపారు. ఆస్పత్రిని వేరే చోటుకు తరలిస్తారన్న ప్రచారంతో అఖిలపక్ష నాయకులు శుక్రవారం వర్ధన్నపేట పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం క్యాంప్​ఆఫీస్​లో ఎమ్మెల్యేను కలిశారు. ప్రస్తుతం ఉన్న ఆస్పత్రి స్థలంలోనే 100 పడకల ఆస్పత్రి నిర్మించాలని కోరారు. వేరే చోటుకు తరలిస్తే చుట్టుపక్కల మండలాల ప్రజలు ఇబ్బంది పడతారన్నారు. స్పందించిన ఎమ్మెల్యే.. తహసీల్దార్ విజయ్​సాగర్​ను పిలిపించి దవాఖాన నిర్మాణానికి అవసరమైన భూమి లభ్యతపై ఆరా తీశారు. 

ఇప్పుడున్న హాస్పిటల్​స్థలంతోపాటు వరంగల్–ఖమ్మం జాతీయ రహదారి సమీపంలో ఉన్న రామాలయం భూములను సర్వే చేసి ఈ నెల 22 లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఐదెకరాల భూమి ఉంటే వర్ధన్నపేటలోనే 100 పడకల ఆస్పత్రి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో అఖిలపక్ష నాయకులు హర్షం వ్యక్తం చేశారు. పటాకులు పేల్చి, స్వీట్లు పంచుకున్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.