వైరా ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధికి రూ. 3 కోట్ల నిధులు : ఎమ్మెల్యే రాందాస్ నాయక్

వైరా ప్రభుత్వ  జూనియర్ కళాశాల  అభివృద్ధికి రూ. 3 కోట్ల నిధులు : ఎమ్మెల్యే రాందాస్ నాయక్
  • నూతన గదుల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే రాందాస్ నాయక్

వైరా, వెలుగు :  వైరా పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రూ. 3 కోట్లతో నిర్మించనున్న 18 నూతన గదులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ శుక్రవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇదే కళాశాలలో చదువుకున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చొరవతో నిధులు మంజూరయ్యాయని, విద్యారంగ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. విద్యార్థులకు మెస్, కాస్మెటిక్ ఛార్జీలను పెంచడంతో పాటు, వైరాలో రూ. 200 కోట్లతో కార్పొరేట్ స్థాయి సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలను త్వరలోనే ప్రారంభించబోతున్నట్లు ఆయన ప్రకటించారు.

తాను కూడా పేదరికంలో కటిక నేలపై పడుకుని చదువుకున్నానని గుర్తు చేసుకున్నారు. అనంతరం ప్రభుత్వ కళాశాలలో చదివి డాక్టర్లు, ఇంజినీర్లుగా స్థిరపడిన పాత విద్యార్థులను ఆయన సన్మానించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బోళ్ల గంగారావు, పలువురు కాంగ్రెస్ నేతలు, కళాశాల ప్రిన్సిపాల్, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.