రేగోడ్.. పీర్లపంజాలకి ఫేమస్​

రేగోడ్.. పీర్లపంజాలకి ఫేమస్​

మొహర్రం పండుగ సందర్భంగా గ్రామాల్లో పీర్లను ప్రతిష్ఠించి ఉత్సవాలు చేస్తారు. పీరు అనే పదం సూఫీ తత్వానికి సంబంధించింది. పీరు అంటే ఆధ్యాత్మిక గురువు అని అర్థం.  పీర్లకు పైన పెట్టే ‘పంజా’లను కంచరి వృత్తివాళ్లు తయారుచేస్తారు. ఎన్నో యేళ్ల నుంచి రేగోడ్ మండలంలో ఉన్న కంచర్లు పీర్ల పంజాలను తయారుచేస్తున్నారు. గతంలో రేగోడ్ మండలంలో దాదాపు 80 కుటుంబాల వాళ్లు కంచరి వృత్తి చేస్తున్నారు. ఇత్తడితో బిందెలు, బకెట్​లు తయారుచేసేవాళ్లు. మొహర్రం సందర్భంగా ప్రతిష్ఠించే  పీర్ల పంజాలను కూడా వాళ్లే తయారు చేసేవాళ్లు. రానురాను ఇత్తడి పాత్రల తయారీ తగ్గిపోవడంతో, ఇప్పుడు పది కుటుంబాలు మాత్రమే ఈ వృత్తిని చేస్తున్నాయి. ప్రతి సంవత్సరం మొహర్రం సందర్భంగా ఇత్తడితో ఎంతో కళాత్మకంగా పీర్ల పంజాలు తయారుచేస్తుంటారు.  మనరాష్ట్రంలో ఉమ్మడి నల్గొండ, వికారాబాద్, నిజామాబాద్, మెదక్​ జిల్లాలతో పాటు, ఆంధ్రప్రదేశ్​లోని కడప, కర్నూలు, మహారాష్ట్రలోని నాందేడ్, షిర్డీ, ముంబయి, కర్ణాటక రాష్ట్రంలోని బీదర్, రాయచూరు వంటి ప్రాంతాల్లో పీర్ల పండుగ చేసుకునేవాళ్లంతా రేగోడ్​కు వచ్చి పీర్ల పంజాలు తయారు చేయించుకుంటారు. పంజాలు తయారుచేయిస్తామని మొక్కుకున్న వాళ్లు ఏ రాష్ట్రం వాళ్లైనా సరే, వాటి తయారీకి రేగోడ్​లోనే ఆర్డర్ ఇస్తారు. పంజా సైజ్​ను బట్టి ఒక్కో పీరు ధర ఏడు నుంచి పదిహేను వేలరూపాయల వరకు ఉంటుంది.  సవారి నింపడంలో రేగోడ్​లోని తెక్కే దర్గా కుటుంబం ఫేమస్. సవారి అంటే తాయత్తులను పూర్వికుల పేరుతో మంత్రాలు పఠించి, పీరులో వేయడం. సవారి నింపడం పూర్తయ్యాక పీర్లను గ్రామాల్లో ప్రతిష్ఠించి పూజలు చేస్తారు.                                                                                         :::  శ్రీధర్​, మెదక్ వెలుగు
నెల రోజుల ముందునుంచి
మా తల్లిదండ్రుల నుంచి మేము ఇత్తడి పాత్రలు, పీర్ల పంజాల తయారీ పని నేర్చుకున్నాం. ప్రతి ఏటా మొహర్రంకి నెల రోజుల ముందు నుంచి పీర్ల తయారీ సీజన్ మొదలవుతుంది.  
                                                                                                                                                                              - మెతుకు సుధాకర్ చారి
వారసత్వంగా వస్తోంది 
సంప్రదాయం ప్రకారం సవారి నింపడం మా తాతల నుంచి చేస్తున్నాం. కిందటేడాది కరోనా ప్రభావం ​పీర్ల పండుగ మీద కూడా పడింది. ఈసారి మాత్రం పీర్ల పంజాల తయారీ బాగానే సాగుతోంది. రోజుకి ఐదు పంజాలలో సవారి నింపుతున్నాం. పీర్లు ప్రతిష్ఠించేవాళ్లు, భక్తులు వారి పూర్వీకుల పేరుతో సవారి నింపించుకుంటారు.
                                                                                                                                                                                             - ఎం.డి.షాదుల్, దర్గా నిర్వాహకులు