Mohit Sharma: క్రికెట్‌కు CSK మాజీ ఫాస్ట్ బౌలర్ రిటైర్మెంట్.. నాలుగు సార్లు ఫైనల్‌కు వచ్చినా IPL టైటిల్ లేదు

Mohit Sharma: క్రికెట్‌కు CSK మాజీ ఫాస్ట్ బౌలర్ రిటైర్మెంట్.. నాలుగు సార్లు ఫైనల్‌కు వచ్చినా IPL టైటిల్ లేదు

టీమిండియా వెటరన్ ఫాస్ట్ బౌలర్ మోహిత్ శర్మ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. బుధవారం (డిసెంబర్ 3) ఇంస్టాగ్రామ్ వేదికగా అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాని మోహిత్ ధృవీకరించాడు. ఇప్పటికే భారత క్రికెట్ లో స్థానం కోల్పోయిన మోహిత్.. ఐపీఎల్ లో ఆడుతూ తన క్రికెట్ ప్రయాణాన్ని కొనసాగించాడు. అయితే క్రికెట్ కు వీడ్కోలు పలికే సరైన సమయం ఇదే అని భావించి రిటైర్మెంట్ అవ్వాలనే నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్ లో తన స్లో బాల్స్ తో ఒక వెలుగు వెలిగిన ఈ హర్యానా పేసర్ 37 ఏళ్ళ వయసులో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున చివరి మ్యాచ్ ఆడాడు.    

ఇంస్టాగ్రామ్ లో తన రిటైర్మెంట్ కు సంబంధించి మోహిత్ ఇలా రాసుకొచ్చాడు. "హర్యానాకు ప్రాతినిధ్యం వహించడం నుండి భారత జెర్సీ ధరించి ఐపీఎల్‌లో ఆడటం వరకు చేసిన ఈ ప్రయాణం అద్భుతంగా సాగింది. నా కెరీర్‌కు వెన్నెముకగా నిలిచినందుకు హర్యానా క్రికెట్ అసోసియేషన్‌కు చాలా ప్రత్యేక ధన్యవాదాలు. అనిరుధ్ సర్‌కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆయన ఎప్పుడూ నాపై నమ్మకముంచి నాకు మార్గదర్శకంగా నిలిచాడు. బీసీసీఐ, నా కోచ్‌లు, నా సహచరులు, ఐపీఎల్ ఫ్రాంచైజీలు, నాకు సపోర్ట్ చేసినవారికి నా ధన్యవాదాలు. ప్రతి విషయంలో నాకు మద్దతు ఇచ్చిన నా భార్యకు ప్రత్యేక ధన్యవాదాలు". అని మోహిత్ శర్మ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. 

మోహిత్ శర్మ అంతర్జాతీయ కెరీర్ విషయానికి వస్తే 2013 నుండి 2015 వరకు భారత జట్టుకు ఆడాడు. 26 వన్డేల్లో 31 వికెట్లు పడగొట్టాడు. 8 టీ20ల్లో 6 వికెట్లు పడగొట్టాడు. 2015  వన్డే వరల్డ్ కప్ లో భారత జట్టులో సభ్యుడు. ఐపీఎల్ డెత్ స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్న మోహిత్ 120 మ్యాచ్ ల్లో 134 వికెట్లు పడగొట్టాడు. 2022 ఐపీఎల్ సీజన్‌కు దూరమైన తర్వాత మోహిత్‌ను 2023లో గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది. ఈ సీజన్ లో మోహిత్ 27 వికెట్లు తీసి తన బౌలింగ్ తో ఆశ్చర్యపరిచాడు. 2024లో గుజరాత్ తరపున 12 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీసిన మోహిత్.. 2025 ఐపీఎల్ సీజన్ లో ఢిల్లీ జట్టు తరపున ఆడాడు.