
ములుగు, వెలుగు: ములుగుతోపాటు పలు గ్రామాల్లో కోతుల గుంపులు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. వైల్డ్‌గా మారి ఎదురు దాడి చేస్తున్నాయి. గురువారం ములుగు మున్సిపాలిటీ పరిధిలోని బండారుపల్లికి చెందిన చంద్రగిరి సరోజన అనే డెబ్బై ఏండ్ల వృద్ధురాలు తన ఇంటి ముందు ఉండగా, ఒక్కసారి కోతులు దాడిచేశాయి. దీంతో వృద్ధురాలు కిందపడగా, కుటుంబ సభ్యులు ములుగు ఆస్పత్రికి తరలించగా చెయ్యి, తొంటి ఎముకలు విరిగినట్లు వైద్యులు తెలిపారు.
మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. కాగా, ములుగు జిల్లా కేంద్రంలో కోతుల గుంపులు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. కొందరు కావాలని గట్టమ్మతోపాటు వివిధ గ్రామాల పరిధిలో సుదూర ప్రాంతాల్లో పట్టిన కోతులను వదిలి వెళ్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ములుగు జిల్లా ఆస్పత్రిలో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 9వరకు 200ల మందికి కోతులు కాటువేసి వైద్యం కోసం వచ్చిన కేసులు నమోదయ్యాయి.
పట్టించడమే పరిష్కారం..
ములుగులో వందల సంఖ్యలో కోతులు తిరుతుండగా, మున్సిపాలిటీ అధికారులు వాటిని పట్టించి అడవుల్లో వదిలివేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పలుమార్లు మున్సిపల్అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు కోతులను పట్టించి తమకు సమస్య లేకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయంపై మున్సిపల్ అధికారులను వివరణ కోరగా, త్వరలోనే కోతులను పట్టించి దూర ప్రాంతాల్లో వదిలేస్తామని చెప్పారు.