నీళ్లలో పిండి కలుపుకొని తాగుతున్నరు ..గాజాలో ఆహార సంక్షోభం.. తిండికి మాడుతున్న జనం

నీళ్లలో పిండి కలుపుకొని తాగుతున్నరు ..గాజాలో ఆహార సంక్షోభం.. తిండికి మాడుతున్న జనం
  •      మానవతా సాయం తగ్గడంతో బిచ్చమెత్తుకుంటూ జీవనం
  •     యుద్ధం ఇలాగే కొనసాగితే ఆత్మహత్యే శరణ్యమని ఆవేదన


డీర్ అల్-బలా (గాజా స్ట్రిప్): ఇజ్రాయెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో 22 నెలలుగా కొనసాగుతున్న  యుద్ధం వల్ల గాజా స్ట్రిప్‌‌‌‌‌‌‌‌లో  తీవ్రమైన ఆహార సంక్షోభం ఏర్పడింది. అందులోనూ గత రెండున్నర నెలలుగా మానవతా సాయంపై ఇజ్రాయెల్ విధించిన పరిమితులు ప్రజలను మరింత కరువులోకి నెట్టింది. తినడానికి తిండి, తాగడానికి నీరు లేకపోవడంతో పిల్లలు, వృద్ధులు, మహిళలు రోజూ పస్తులతో పడుకుంటున్నారు. సొంత ఊరిని, ఇంటిని వదిలి శరణార్థి శిబిరాల్లో ఉంటూ ఎండకు, వానకు ఇబ్బంది పడుతున్నారు. కన్నీటితో ఆకలి తీర్చుకుంటూ, ఇజ్రాయెల్ సైన్యం దాడులకు భయపడుతూ ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బతుకుతున్నారు. ఈ కష్టాలను భరించలేక పోతున్నామని.. యుద్ధం ఇలాగే కొనసాగితే
ఆత్మహత్యే శరణ్యమని వాపోతున్నారు.   

ప్రస్తుతం గాజాలో ఇదీ పరిస్థితి..!

గాజాలో ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. ఇజ్రాయెల్ తో కొనసాగుతున్న యుద్ధం, మానవతా సాయం అందకపోవడం అక్కడి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నది. మానవతా సాయం పూర్తిగా తగ్గిపోవడంతో శరణార్థి శిబిరాల్లోని ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే వరకు తమ పిల్లలతో కలిసి కేవలం ఆహారం కోసమే వెతుకుతున్నారు. నీరు దొరకకపోవడంతో సముద్రం నుంచి నీటి(ఉప్పునీరు)ని తెచ్చుకుని స్నానాలు చేస్తున్నారు. స్నానాల తర్వాత తమ పిల్లలతో కలిసి చుట్టు పక్కల ఉన్నవారి దగ్గర బిచ్చమెత్తడానికి బయలుదేరుతున్నారు. కందిపప్పు, పిండి వంటివే ఎక్కువగా బిచ్చంగా దొరుకుతుండటంతో వాటిని నీటిలో కలుపుకుని తాగుతున్నారు. ఇలా రోజంతా ఆహారం, నీరు, ఇతర సామగ్రి కోసం పోరాడటమే వారి పనైపోయింది. ఆహారం కోసం తిరిగి తిరిగి తాము బలహీనమై పోతున్నామని గాజా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యుద్ధం వల్లే తాము ఇన్ని కష్టాలు పడుతున్నామని..వేలాది కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయని చెప్పారు. గాజాలో ఆహార సంక్షోభం తీవ్రరూపం దాల్చుతోందని నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు.