కనిపించే దైవం... ఎందుకంటే

కనిపించే దైవం... ఎందుకంటే

అమ్మ... దైవంతో సమానం. ఎందుకంటే.. పొత్తిళ్లలో బిడ్డను చూడగానే ప్రసవ వేదనను మర్చిపోతుంది. నవమాసాలు మోసి, కన్న బిడ్డల్ని కంటికి రెప్పలా చూసుకుంటుంది. బిడ్డల ఎదుగుదలనే తన ఎదుగుదల అనుకుంటుంది. పిల్లల మనసును అర్థం చేసుకుని అడగకుండానే అన్నీ ఇస్తుంది అమ్మ. ఎంత కష్టమొచ్చినా భూదేవిలా తనలో దాచుకుంటుందే తప్ప, ఎవరినీ నిందించదు. ప్రేమ, ఓర్పు, సహనం, ధైర్యం.. వీటిన్నింటికి మారుపేరు అమ్మే. ఎప్పుడూ మంచే జరగాలని కోరుకునే అమ్మ మనసు అమృతం కన్నా గొప్పది. అలాంటి అమ్మలందరికీ ప్రేమతో.. మాతృదినోత్సవ శుభాకాంక్షలు.

తల్లీబిడ్డలది పేగు బంధం. అందుకే పుట్టినప్పటి నుంచి బిడ్డ ఆకలి, నొప్పి, బాధ.. అన్నీ చెప్పకుండానే అమ్మకు తెలుస్తాయి. అప్పటిదాకా ఆమె అమ్మాయిగా ఆమెకి ఎన్నో ఆలోచనలు ఉన్నా, అమ్మ అయ్యాక తన ఆలోచనంతా బిడ్డల మీదే. పిల్లలు ఏదైనా సాధిస్తే, అది తన గెలుపు అన్నట్టే మురిసిపోతుంది. పిల్లలు ఎంత పెద్దవాళ్లైనా, ఇంటి నుంచి బయటికెళ్తే తిరిగి వచ్చేదాకా కళ్లార్పకుండా వాళ్లకోసం ఎదురు చూస్తుంది. పరీక్షల్లో తప్పామనే కోపంతో నాన్న తిడుతుంటే, ఈసారి మళ్లీ రాసి పాసవుతాడంటూ వెనకేసుకొస్తుంది. చిన్నప్పుడు లాలిస్తూ, బుజ్జగిస్తూ, కథలు చెప్పే అమ్మ.. పెద్దయ్యాక ఫ్రెండ్​లా, మెంటార్​లా పక్కనే ఉండి సపోర్ట్ చేస్తుంటుంది. అమ్మకి తెలుసు.. మనం అనుకున్నది సాధించలేకపోతే, ఎంత బాధ పడతామో అని. 

ఆడుకునేటప్పుడో, పనిచేసేటప్పుడో ఏదైనా గాయం అయితే మనకు తెలియకుండానే మన నోటి నుంచి ‘అమ్మా’ అనే అరుపు వస్తుంది. ఎందుకో తెలుసా... గాయాన్ని మాన్పేది మందైనా, నొప్పి బాధను తీర్చేది మాత్రం అమ్మే. ఎప్పుడైనా జలుబో, జ్వరమో వచ్చిందంటే.. అది తగ్గేదాకా పగలూరాత్రి సపర్యలు చేస్తుంది. తన ఆరోగ్యం గురించి ధ్యాస ఉండదు ఆమెకు. బిడ్డ ఆరోగ్యం బాగయ్యే వరకు ఆమె మనసు కుదుటపడదు. అంతెందుకు, అమ్మ ప్రేమ గురించి చెప్పాలంటే.. చూడ్డానికి అంత బాగోలేకపోయినా అమ్మ కంటికి మనం చాలా అందంగా కనిపిస్తాం. ఎందుకంటే ఆమెది అందమైన మనసు కాబట్టి. 

పిల్లలు బాగా చదివి, ఉద్యోగాల్లో స్థిరపడి, దేశాలు దాటి వేల మైళ్ల దూరంలో వెళ్లినా... అమ్మకి కోపం రాదు. దానికి బదులు వాళ్ల మీద కొండంత ప్రేమ దాచుకుంటుంది. అమ్మ మనసంతా బిడ్డలపైనే ఉంటుంది. ఆడపిల్లను అత్తవారింటికి పంపేటప్పుడు, గుండెల్లో బాధను దిగమింగుకుని ఏ కష్టమొచ్చినా ‘నేనున్నా’ అంటూ భరోసా ఇస్తుంది. పండుగ పబ్బాలకు అందరికీ కొత్త బట్టలు తీసే అమ్మ, తను మాత్రం ఆ పాత చీరలోనే ఉంటుంది. అందరికీ రుచిగా వండి పెట్టి, కడుపు నింపినప్పుడే తనకు పండుగ అనుకుంటుంది.

ఇలా చెప్పుకుంటూ పోతే అమ్మ గొప్పతనం హిమాలయాల కంటే ఎత్తైనది. అమ్మ రుణాన్ని తీర్చుకోవడం ఈ సృష్టిలో ఏ బిడ్డకూ సాధ్యం కాదు. అందుకే అవకాశం వచ్చినప్పుడల్లా అమ్మను సంతోష పెట్టడం నేర్చుకోవాలి. వయసు మళ్లిన తల్లిని ఈసడించుకోక చేరదీయండి. అప్పుడు కూడా ఆమె పిల్లలకు భారం కాకూడదనే అనుకుంటుందని తెలుసుకోండి. అలాంటి అమ్మను బతికినన్నాళ్లు బాధ పెట్టకుండా చూసుకోండి. ఆమె ప్రేమకు ప్రతిగా తిరిగి ప్రేమను ఇవ్వండి. అమ్మ త్యాగానికి మనసారా చేతులెత్తి నమస్కరించండి. అదే ఆమెకి బిడ్డలుగా మనమిచ్చే గౌరవం. మాతృదినోత్సవ సందర్భంగా ఈరోజు అమ్మను సంతోషపెట్టేలా కానుక ఏదైనా ఇవ్వండి.  

చరిత్రలో...

మరోవైపు, ఏటా మే రెండో ఆదివారం ప్రపంచ మాతృదినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దీనికి పెద్ద చరిత్ర ఉంది. గ్రీస్‌లో ‘రియా’ అనే దేవతను ‘మదర్‌ ఆఫ్‌ గాడ్స్‌’గా భావించి ఏడాదికోసారి నివాళి అర్పించేవారు. 17వ శతాబ్దంలో ఇంగ్లాండ్‌లో తల్లులకు గౌరవంగా ‘మదరింగ్‌ సండే’ పేరిట ఉత్సవం చేసేవాళ్లు. ‘జూలియవర్డ్‌ హోవే’ అనే మహిళ అమెరికాలో1872లో మొదటిసారిగా ప్రపంచ శాంతి కోసం ‘మదర్స్​ డే’ నిర్వహించాలని కోరింది. వెస్ట్‌ వర్జీనియాలో అన్నా జర్విస్‌ అనే మహిళ తల్లి.. అన్నా రీవ్స్‌ జర్వీస్‌1905లో చనిపోయింది. ఆ సంవత్సరం నుంచే మదర్స్ డేని గుర్తింపు పొందిన సెలవుదినంగా జరుపుకోవాలని కోరింది. ఆ తర్వాత రెండు సంవత్సరాలకు  1907వ సంవత్సరంలో అమెరికాలో మాతృదినోత్సవం సెలబ్రేట్‌ చేసుకోవడం ప్రారంభమైంది. అలా1914లో మనదేశంలో మొదటిసారి మాతృదినోత్సవాన్ని జరుపుకున్నారు.